
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రిజైన్ లెటర్ సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామా అందించాననీ, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని చెప్పారాయన. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడాననీ, ఆయనతో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని విజయసాయి వివరించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని విజయసాయరెడ్డి చెప్పారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. తన పిల్లల సాక్షిగా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో ఏం సంబంధ లేదన్నారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది విజయసాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం. ఇక, వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం సంచలనం రేపుతోంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి.. ఆ తర్వాత జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండి.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అస్త్రసన్యాసం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో తనకు విభేదాలు లేవనడం.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందనడం.. ముఖ్యంగా తన ప్రోత్సహించారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు చెప్పడం ఆసక్తి రేపుతోంది.
మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సీబీఐ. విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
జగన్‌కు, భారతికి కృతజ్ఞతలు తెలిపిన విజయసాయి
నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానంటూ శుక్రవారం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రెండుసార్లు తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు, వైఎస్ భారతికి సదా కృతజ్ఞుడిని అంటూ ఆ పోస్టులో తెలిపారు సాయిరెడ్డి. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు ఆయన.
మోదీ, అమిత్‌షాలకు ధన్యవాదాలన్న విజయసాయి
ఇక గత తొమ్మిదేళ్లుగా తనను ప్రోత్సహించిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు విజయసాయి. టీడీపీతో తాను రాజకీయంగా విభేదించానని, వ్యక్తిగతంగా చంద్రబాబుతో తనకు విభేదాలు లేవన్నారు ఆయన. పవన్ కల్యాణ్‌తో తనకు చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయి రెడ్డి తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు విజయసాయి.
2023లో రెండోసారి రాజ్యసభ ఎంపీ పోస్ట్
2023లో రెండోసారి రాజ్యసభకు విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. అంటే 2028వరకు ఆయన పదవీకాలం ఉంది. అయినప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత జగన్ జైలులో ఉన్న సమయంలోనూ వైసీపీకి అండగా ఉన్నారు. 2014లో వైసీపీ ఓడిపోయినా.. 2016లో రాజ్యసభకు జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలవడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకం. పార్లమెంటు సభ్యునిగా అనేక స్టాండింగ్ కమిటీల్లో ఆయన పనిచేశారు. పార్లమెంట్‌లో 30 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు.
వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా చేసిన విజయసాయి
ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా విజయసాయి రెడ్డి పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో విజయసాయిరెడ్డి ఆసక్తి చూపారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఆయనను ఎంపీగా రాజ్యసభకు నామినేట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి.. ఆ తర్వాత జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండి.. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అస్త్రసన్యాసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..