
విజయవాడ, నవంబర్ 13: విజయవాడ సూర్యరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి. నూజివీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి, విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరు 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు సంతానం. ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది. 2022 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్న ఇద్దరు కలకాలం జీవిస్తారని భావిస్తే.. పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనితో దాదాపు ఏడాదిన్నర కాలంగా సరస్వతి, విజయ్ వేరుగా నివాసం ఉంటున్నారు.
అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలతో సరస్వతి ఒంటరిగా నివాసం ఉంటున్న వేళ.. భర్త విజయ్ పై వేధింపుల కేసు పెట్టింది. దీనితో నూజివీడులో కేసు నమోదు కాగా 5 నెలల జైలుకు సైతం వెళ్లొచ్చాడు. దీనితో ఇద్దరి విబేధాలు తారస్థాయికి చేరాయి. చాలాకాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పని చేస్తున్న వీన్స్ ఆసుపత్రికి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో విధులు ముగించుకొని వస్తున్న భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు.
వీన్స్ ఆసుపత్రి నుంచి పరిగెత్తి కత్తితో దాడి చేసిన విజయ్ ను నిలువరించేందుకు వెళ్ళిన స్థానికులను సైతం బెదిరించాడు. దీనితో సరస్వతిని కాపాడేందుకు వెళ్ళి ఏమి చేయలేక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు వచ్చి విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య తనను వేధిస్తున్న కారణాలతో హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు నిందితుడు విజయ్. వివాహేతర సంబంధం పెట్టుకొని కేసులు పెట్టీ తనని సరస్వతి వేధిస్తోందని తెలిపాడు. అరెస్టు చేయించడంతో పాటు విడాకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా హత్య చేశానని విజయ్ పోలీసుల విచారణలో తెలిపాడే. హత్య చేశానన్న పశ్చాత్తాపం లేకుండా పోలీసులతో వాగ్వాదంకు దిగడంతో పాటు తాను చనిపోతానని బెదిరింపులకు దిగడం గమనార్హం. విజయ్ నుంచి కత్తిని స్వాధీనం చేసుకొన్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.