
సాధారణంగా ఎవరిపైనైనా దాడి చేయాలంటే.. కత్తులు, కర్రలు వాడుతారు. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం కిచెన్‌లో ఉండే దోసెల పెనంతోనే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వడ్డెర చెరువు గ్రామంలో నివాసముండే సురేష్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వెదురుకుప్పం మండలం మోర గ్రామానికి చెందిన కస్తూరి అనే యువతితో వివాహం జరిగింది.
ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. సురేష్ టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భార్య ఇంట్లోనే ఉంటూ పాపను, ఇంటిని చూసుకునేది. అయితే గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న సురేష్.. రోజూ తాగి వచ్చి ఆమెను హింసించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా ఫుల్‌గా తాగి వచ్చిన సురేష్.. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేష్.. కిచెన్‌లో ఉన్న దోసెల పెనంతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ ప్రాణాలు విడిచింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.