Huge Robbery: ఒంగోలు నగరంలో పట్టపగలు భారీ చోరీ.. 16లక్షల విలువైన సొత్తు అపహరణ..
Huge Robbery: ఒంగోలు నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. నగరంలోని బండ్లమిట్టలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన..
Huge Robbery: ఒంగోలు నగరంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. నగరంలోని బండ్లమిట్టలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ.16లక్షల విలువైన సొత్తును అపహరించుకెళ్లారు. అందులో 56.2 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 27వేల నగదు ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బండ్లమిట్టలో నివాసం ఉండే చక్కా మల్లికార్జునరావు, ఆయన భార్య పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెళ్లారు. వారి కుమారుడు కిరణ్‌కుమార్, కోడలు మధ్యాహ్నం వల్లూరమ్మ గుడికి వెళ్తూ ఇంట్లో పిల్లలు ఉండటంతో తాళం వేయలేదు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఆ సమయంలో మూడో అంతస్థులో ఉన్న బెడ్‌రూంలోకి చొరబడిన దొంగలు దుస్తుల కింద ఉన్న తాళాలు తీసుకున్నారు. వాటి సాయంతో కప్ బోర్డులు తెరిచి వాటిలో ఉన్న 56.2 సవర్ల (400 గ్రాముల) బంగారు ఆభరణాలు, రూ. 27వేల నగదు అపహరించుకెళ్లారు.
సాయత్రం గుడి నుంచి కిరణ్‌కుమార్, ఆయన భార్య ఇంటికి చేరుకున్నారు. దుస్తులు, సామగ్రి చిందరవందరగా పడి ఉండటం, కప్‌బోర్డు తెరిచి ఉండటంతో అనుమానంతో చూడగా బంగారు ఆభరణాలు, డబ్బులు కన్పించలేదు. దీంతో దొంగలు పడ్డారని నిర్ధారించుకొని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన వాటి విలువ రూ.16లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సీసీఎస్ డీఎస్పీ ప్రసాద్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Also read: