ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు పాములు, కొండచిలువలు జనాలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏపీవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు, తోటలు నీట మునిగాయి. దీంతో ఆవాసాలు కోల్పోయిన సరీసృపాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, పశువుల పాకల్లోకి కోబ్రాలు, నాగుపాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ డీజీఎం ఇంట్లో భారీ కొండచిలువ చేరి కలకలం సృష్టించింది.
ఉక్కునగరం సెక్టార్ క్వార్టర్స్‌లో నివాసముండే స్టీల్ ప్లాంట్ డీజీఎం మిశ్రా ఇంటి పరిసరాల్లోకి చొరబడిన భారీ కొండచిలువ అక్కడ పెరట్లో పడేసి ఉన్న వలలో చిక్కుకుంది. వలలో ఇరుక్కుపోయి తీవ్రంగా సతమతమైన కొండచిలువ తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పెరట్లోనుంచి వింత శబ్దాలు వినిపిస్తుండటంతో పెరట్లోకి వచ్చిన మిశ్రా అక్కడ సీన్ చూసి భయంతో ఇంట్లోకి పరుగుతీశారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆ భారీ కొండచిలువను చూసి షాకయ్యారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న కిరణ్ కొండచిలువను పట్టుకునే ప్రయత్నంలో అతనిపై దాడికి యత్నించింది. చాకచక్యగా తప్పించుకున్న కిరణ్ మొత్తానికి కొండచిలువను బంధించి దానిని వలనుంచి కాపాడి తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..