
చోరీ జరిగిన సొత్తు దొరికినా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగితే గాని పోగొట్టుకున్న సొత్తు యజమాని చెంతకు చేరడం లేదు. అయితే ఏలూరు జిల్లా పోలీసులు నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. దొంగలించిన సొత్తును దొంగల నుండి రికవరీ చేసిన వెంటనే యజమానికి ఆ సొత్తును అందజేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా టీ నర్సాపురంలో జరిగిన దొంగతనంలో పోలీసులు చేధించి దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రికవరీ చేసిన 2.5గ్రా బంగారం, 400గ్రా వెండి వస్తువులను బాధితుల ఇంటికి వెళ్లివారికి పోగొట్టుకున్న నగలను అప్పజెప్పారు. దీంతో బాధితులు ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. సాధారణంగా దొంగతనాలు జరిగినప్పుడు యజమాని ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టి దొంగలను వెతికి పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ జరిగిన సొత్తును స్వాధీనం చేసుకుంటారు.
వాటిని ముద్దాయిలతో పాటు కోర్టులో స్వాధీన పరుస్తారు. కోర్టులో వాదనలు జరిగి కేసు ముగిసిన తర్వాత గానీ ఆ సొత్తును పోగొట్టుకున్న యజమానికి కోర్టు స్వాధీనపరచదు. ఈ తతంగం అంతా జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. దీంతో ఒక పక్క పోగొట్టుకున్న నగలు, నగదు దొరికాయన్న ఆనందం కన్నా వాటిని వెంటనే పొందలేకపోతున్నామన్న విచారంతో పాటు న్యాయస్థానం చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడడంతో బాధితులకు మరింత బాధ ఎక్కువైంది. అయితే ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ బాధితులకు సత్వర న్యాయం జరిపేందుకు చట్టాలకు అనుగుణంగా దొంగల నుండి స్వాధీన పరుచుకున్న నగదు, నగలను వెంటనే బాధితుల ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పజెప్తున్నారు.
న్యాయ వ్యవస్థలో ఉన్న సెక్షన్ 497 bns, 503 bnsలకు అనుగుణంగా బాధితులు పోగొట్టుకున్న నగదును పోలీసులు రికవరీ చేసిన వెంటనే మధ్యవర్తుల సమక్షంలో బాధితులకు అప్పజెప్పవచ్చు. అయితే విచారణ సమయంలో బాధితులు పోలీసులు అప్పజెప్పిన నగలను, నగదును న్యాయమూర్తికి చూపించవలసి వస్తుంది. అలా చూపించాకపోయే కేసు వీగిపోతుంది దీంతో కేసు వీగిపోకుండా ఉండడానికి రికవరీ చేసిన సొత్తును కోర్టులో స్వాధీన పరుస్తూ ఉంటారు అయితే కొత్తగా వచ్చిన యువ ఐపీఎస్ అధికారులు న్యాయవ్యవస్థలో ఉన్న సెక్షన్ 497, 503 బి ఎన్ ఎస్ లను ఎందుకు అమలుపరచి బాధితులకు సత్వర న్యాయం చేయకూడదన్న ఆలోచనతో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అమలు చేస్తున్నారు ఇలాగే ప్రతి జిల్లాలోనూ పోలీస్ అధికారులు చొరవ తీసుకుంటే బాధితులకు పూర్తీ న్యాయం జరుగుతుందని అంటున్నారు.