
వరుస సెలవులు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు.. పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం శివనామస్మరణతో మారు మ్రోగుతోంది. భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల సర్వదర్శనం ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు సొంత కార్లు, వాహనాల్లో రావడంతో శ్రీశైలం- హైదరాబాద్, శ్రీశైలం- దోర్నాల ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కొండపై ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో దర్శనానికి 16 గంటలు పడుతుంటే, యాదాద్రి, వేములవాడలో నాలుగు గంటల సమయం పడుతోంది.
మరోవైపు పర్యాటక ప్రాంతాల్లో కూడా సందడి కనిపిస్తుంది. అరకు అందాలు పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి. ఆంధ్రా ఊటీగా పిలిచే అరకు సోయగాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. జనం పెద్దసంఖ్యలో తరలివచ్చి… మంచుదుప్పట్లో ప్రకృతి అందాలు మరింత పరవశింపచేస్తున్నాయి. ఏజెన్సీలో ఎక్కడ చూసినా పెద్దసంఖ్యలో పర్యాటకులే కనిపిస్తున్నారు. బొర్రా గుహల నుంచి లంబసింగి వరకు జనసందడి ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలకు వాహనాలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి.
శీతాకాలం కావడంతో ప్రకృతి దృశ్యాలు మరింత కనువిందు చేస్తున్నాయి. వంజంగి కొండపై పాలసముద్రాన్ని తలపించే మేఘాలు, సూర్యోదయాన్ని చూసి పులకించిపోయారు. అరకు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఇక మార్నింగ్, ఈవినింగ్ టైంలో పర్యాటకులు, క్యాంప్ ఫైర్, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు. అరకు అందాలను అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పలేమంటున్నారు పర్యాటకులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..