అశోక చక్రవర్తి అంటే ఇది ఏ సినిమా టైటిల్ అని ప్రశ్నించే కాలం ఇది… నేటి యువతకు చారిత్రక విషయాలు… రాజుల కధలు సినిమా రూపంలో చెబితేనే అర్ధమవుతాయి… అంతా డిజిటల్ మయం అయిన ఈ రోజుల్లో ‘ కాంతారా ‘ లాంటి సినిమాల్లో చూపించే సాంప్రదాయ పద్దతులు కట్టిపడేసి ధియేటర్ల రప్పించి కాసుల వర్షం కురిపిస్తాయి… ఇన్నేళ్ళూ శ్రీ కృష్ణడు అంటే గుడిలో ఉండే దేవుడు అనుకునే నేటి తరానికి ఆయన ఓ జీవితం ఓ ఎన్‌సైక్లోపీడియా అని అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ హిందీ నటుడు ‘ కార్తికేయ 2 ‘ సినిమాలో చెబితే అద్భుతంగా ఉందంటూ కేవలం ఈ ఒక్క సీన్ కోసమే సినిమా చూసిన వాళ్లున్నారు.. ఈ విషయాలన్నీ మన పురాతన గ్రంధాల్లో, పురాణాల్లో ఉన్నవే.. అయితే వాటిని చదివే ఓపిక, తెలుసుకునే ఆశక్తి నేటి తరానికి ఉండటం లేదు.. అలా నేటి తరానికి తెలియకుండానే మట్టిలో కలిసిపోయే చారిత్రక విషయాలు, సంపదలు కోకొల్లలుగా ఉన్నాయి… అలాంటి వాటిలో ఒకటి అశోకుడి కాలంలో దేదీప్యమానంగా విరాజిల్లిన ప్రకాశంజిల్లా దొనకొండ సమీపంలోని చందవరం బౌద్ధస్తూపం..
అశోకచక్రవర్తి… భారతదేశం గర్వించదగ్గర రారాజు… అశోకుడు అంటే చెట్లు నాటించెను అని మాత్రమే తెలుసుకానీ ఆయన పాలనలో చేపట్టిన పనులు.. చేసిన మత ప్రచారం.. నాటి కట్టడాలు.. ఇలా ఎన్నింటి గురించో మనం పుస్తకాల్లో గొప్పగా చదువుకుంటాం. ఆ చక్రవర్తి పాలనా విశేషాలను ఘనంగా చెప్పుకొంటుంటాం. అదే రాజు ఏలుబడిలో నిర్మితమై మన కళ్లెదుటే ఉన్న ఓ చారిత్రక సంపదపై మాత్రం నిర్లక్ష్యాన్ని చూపుతున్నాం. ఓ మహా చరిత్రను మట్టి కిందనే ఉండిపోయేలా చేస్తున్నాం. భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో అశోకుడు ఒకరు. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో పాలించిన ఆయన బౌద్ధ మత ప్రచారంలో భాగంగా అక్కడక్కడా స్తూపాలను నిర్మించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రకాశంజిల్లా చందవరంలో ఏర్పాటు చేసిన బౌద్దస్తూపం అతి ప్రాచీనమైనదిగా చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతంలోని కొండపై అప్పట్లో బౌద్ధులు అధికసంఖ్యలో నివసించారని చెప్పడానికి అనేక ఆనవాళ్లు కూడా ఇప్పటికీ లభిస్తూనే ఉంటాయి. ఇక్కడ బుద్ధుని విగ్రహాలు కనిపించవు. ధర్మచక్రం, బౌద్ధ వృక్షాలు మాత్రమే కనిపిస్తాయి. బౌద్ధ మత వ్యాప్తి కోసం ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని బౌద్ధ సన్యాసులు కృషి చేశారు. ఈ కొండ పైన ఉన్న అందమైన స్తూపం వంటిది మరెక్కడా కనిపించదని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెబుతుంటారు.
మట్టిలో కలిసిపోతున్న చారిత్రక సంపద…
ఎంతో చరిత్ర ఉన్న బౌద్ధ స్తూపాల్లో దొనకొండ మండలంలోని చందవరం ఒకటి. దీని అభివృద్ధిపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అరకొరగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ.. పనులు వేగంగా ముందుకు కదలటం లేదు. ఫలితంగా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. అదే సమయంలో చారిత్రక విశేషాలు ఎన్నో మరుగున పడిపోతున్నాయి. ఏళ్ల తరబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు ఖర్చు పెట్టినవి కూడా ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. బౌద్ధ స్తూపం ఆనాటి రూపం పోకుండా ఉండేందుకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు… అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు… దీంతో ఇక్కడి చారిత్రక సంపద రోజురోజుకు ఆనవాళ్లు లేకుండా పోతోంది…
అభివృద్ధిపై కుంటి సాకులు…
చందవరంలో లభించిన శిల్ప సంపద ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లభించిన కొన్ని శిల్పాలను గతంలో ఆస్ట్రేలియాలోని మ్యూజియంలో ప్రదర్శించారు. ప్రస్తుతం దిల్లీ నేషనల్ మ్యూజియంలోనూ ఉంచారు. స్థానికంగా లభించిన ఆధారాలు, శిల్పాలను భద్రపరిచేందుకు ఈ ప్రాంతంలో ఓ ఇరవై సెంట్ల స్థలంలో మ్యూజియం నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఆచరణ రూపం దాల్చలేదు. దీంతో లభించిన కొన్ని శిల్పాలను సంరక్షించేందుకు పంచాయతీ భవనంలో వాటిని భద్రపరిచారు. వీటికి రక్షణగా ఇద్దరు సిబ్బందిని నియమించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ముప్ఫై సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను ఏపీ టూరిజం వారికి అప్పగించారు. వారు కొంత చేసి తిరిగి పురావస్తు శాఖకు అప్పగించారు. దీంతో నిధులున్నా.. వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో శాఖల మధ్య సమన్వయం లోపం శాపంగా మారింది. వాస్తవానికి పనులు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి పర్యాటకులు వచ్చేలా ప్రచారం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయిస్తే చారిత్రక సంపదను కాపాడినవారవుతారు.
Reporter: ఫైరోజ్ , Tv9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..