
కంపెనీస్ డ్రివెన్ బై స్పీడ్ చూస్ ఏపీ.. అంటూ విశాఖ వేదికగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన CII సదస్సుకు అపూర్వ స్పందన వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడుల జాతర కొనసాగింది. విశాఖ సీఐఐ సమ్మిట్‌లో 4వేల 975 మంది భాగస్వామ్యం అయ్యారు. ఇందులో 630 మంది విదేశీ ప్రతినిధులు. మొత్తంగా ఈ సదస్సులో 613 ఎంవోయూలు జరిగాయి. వాటి ద్వారా 13 లక్షల 25 వేల కోట్ల పెట్టుబడులు.. 16.31 లక్షల మంది ఉపాధి లభించనుందని చంద్రబాబు ప్రకటించారు. గడిచిన 17నెలల్లో 9లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఏపీ ఆకర్షించింది. ఇక.. సీఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాలతో.. ఈ లెక్క 25 లక్షలు దాటింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం అంటూ పేర్కొన్నారు. మంత్రులు, అధికారుల టీం వర్క్ తోనే సమ్మిట్ సూపర్ హిట్ అయ్యిందని పేర్కొన్నారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం మంత్రులు, అధికారులు, ఉద్యోగులను సీఎం అభినందించారు. అవార్డులు అందించి… ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సీఐఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు. 45 దేశాల్లో మన సమ్మిట్ చర్చనీయాంశమైందంటే, విశాఖ పేరు మార్మోగుతోందంటే టీం వర్క్ తోనే ఇది సాధ్యమైందని.. ఈ సదస్సులో అర్ధవంతమైన, విజ్ఞానవంతమైన చర్చలు జరిపామని తెలిపారు. దావోస్ లో ఎంవోయూలు బయట జరుగుతాయి. ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళుతోంది, భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, ఎదురయ్యే సవాళ్లు, అందివచ్చే అవకాశాలపై మెయిన్ వెన్యూలో చర్చిస్తారన్నారు. కానీ వినూత్న పద్ధతిలో విశాఖ సమ్మిట్ కు శ్రీకారం చుట్టామని.. ఎవరికి ఏ సబ్జెక్ట్ పైన ఆసక్తి ఉంటే ఆ సెమినార్ కు వెళ్లే అవకాశం కల్పించామన్నారు. సమ్మిట్ లో వెన్యూ మొదలుకొని మెనూ వరకూ అంతా ప్లానింగ్ తో నిర్వహించామన్నారు.
విదేశీ ప్రతినిధులను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.. మోదీ బలమైన నాయకుడు అనే భావన ప్రపంచమంతా ఉంది. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు పెట్టొచ్చనే ధైర్యాన్ని పారిశ్రామికవేత్తల్లో కలిగించారన్నారు.
#CIIPartnershipSummit2025 #CIISummitGrandSuccess
The CII Partnership Summit in Visakhapatnam has been an outstanding success. More than an investment summit, it truly became a platform for partnership, where ideas were shared, innovation was explored, and strong networks for… pic.twitter.com/bFSWHOwrpa— N Chandrababu Naidu (@ncbn) November 15, 2025
2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. విధ్వంస పాలనకు చరమగీతం పలికారని చంద్రబాబు పేర్కొన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..