AP News: ఆ ఇంటి కోడి ఈ ఇంటికొచ్చిందట.. అంతే! సీన్ చిరిగి చేటయ్యింది..

| Edited By: Ravi Kiran

Nov 10, 2023 | 7:44 PM

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే తుపాకీతో కాల్చేశాడు రుద్రయ్య పాత్రధారి రావుగోపాలరావు. ఇది ఎన్టీఆర్‌ నటించిన యమగోల సినిమాలో అందరీకి సుపరిచితమైన సీన్‌. అయితే ఆ ఇంటి కోడి ఈ ఇంటికొచ్చిందన్న కోపంతో తలలు పగులగొట్టుకున్నారు పాపినేనిపల్లి గ్రామస్థులు. సీన్‌ కట్‌ చేస్తే..! ఏం జరిగిందంటే..

AP News: ఆ ఇంటి కోడి ఈ ఇంటికొచ్చిందట.. అంతే! సీన్ చిరిగి చేటయ్యింది..
Hen
Follow us on

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే తుపాకీతో కాల్చేశాడు రుద్రయ్య పాత్రధారి రావుగోపాలరావు. ఇది ఎన్టీఆర్‌ నటించిన యమగోల సినిమాలో అందరీకి సుపరిచితమైన సీన్‌. అయితే ఆ ఇంటి కోడి ఈ ఇంటికొచ్చిందన్న కోపంతో తలలు పగులగొట్టుకున్నారు పాపినేనిపల్లి గ్రామస్థులు. సీన్‌ కట్‌ చేస్తే..! ఏం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కంభం ఆసుపత్రి ఆవరణలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, నిందితులు మళ్లీ గొడవపడ్డారు. అసలు ఈ వివాదానికి కారణం పాత కక్షలు కాదు.. ఫ్యాక్షన్‌ కక్షలు అంతకన్నా కాదు.. భూమి వివాదం కూడా లేదు.. మరెందుకు ఊళ్లో, ఆసుపత్రిలో రెండుసార్లు ఎందుకు కొట్టుకున్నారని ఆరా తీసిన పోలీసులకు దిమ్మతిరిగే కారణం చెప్పారు గ్రామస్థులు. ఇంతకీ కారణం ఏంటంటే.! ఆ ఇంటి కోడి ఈ ఇంటి కొచ్చిందట.. అదీ సంగతి..! ఆ ఇంటి కోడి ఈ ఇంటికొస్తే అంతలా ఎందుకు కొట్టుకున్నారంటే.. ఇక్కడంతే అంటున్నారట గ్రామస్థులు.

అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో ఓ వర్గానికి చెందిన ఇంటికి మరో వర్గానికి చెందిన పక్కింట్లో ఉండే కోడి వచ్చింది. వచ్చిన కోడి ఊరుకుందా..! తన సహజ గుణంతో ఇంటి ఆవరణ అంతా తెగ కెలికేసింది. ఇంట్లోకి వచ్చి రెట్టలు వేసి పెంట పెంట చేసేసింది. దీంతో అప్పటికే ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే చాలు కస్సుబుస్సు మంటున్న ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వాళ్లు కోడి విషయంలో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కంభంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అదే సమయంలో తమకు కూడా గాయాలయ్యాయంటూ మరో వర్గానికి చెందిన వాళ్లు కూడా వచ్చారు. ఆసుపత్రి ఆవరణలో మళ్లీ కోడి విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈసారి జరిగిన ఘర్షణలో మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది తలలు పగిలాయి. గాయపడ్డవారిని కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..