Krishna River: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

|

Jul 29, 2021 | 12:43 PM

ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది.

Krishna River: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద
Krishna River
Follow us on

ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం కనువిందు పర్యాటకులను చేస్తోంది. ఎగువన వస్తోన్న వరదనీటితో జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహాం కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌ 45 గేట్లు.. ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4.26లక్షల క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 4.31 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. జూరాల ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1632.62 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఏంసీలు ఉండగా, ప్రస్తుత నీటినిల్వ 99 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 82,150 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 31600 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

పైనుండి వరదనీరు ఉధృతంగా వస్తుండంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లు, 10 అడుగుల మేర ఎత్తి, నీటిని కిందకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీళ్లు.. పాలనురుగుతో శ్రీశైలంలో సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రస్తుతం శ్రీశ్రైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4.60లక్షల క్యూసెక్కులుగా, ఔట్‌ ఫ్లో 2.20లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు ఉండగా. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుతుతోంది. 2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇదే తొలిసారన్నారు అధికారులు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో ..నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే.. నాగార్జునసాగర్‌ గేట్లు కూడా మరో మూడు నాలుగు రోజుల్లో తెరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 9 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటి మట్టం 590 అడుగులు కాగా. ప్రస్తుతం 543 అడుగులకు చేరుకుంది నీటిమట్టం. సాగర్ పూర్తిస్థాయి సామర్త్యం 312 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 196 టీఎంసీలకు చేరుకుంది. ఈ నీటి నిల్వలతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు ప్రాజెక్టు అధికారులు. కృష్ణమ్మ పరివాహాక ప్రాంతమంతా జళకళతో నిండిపోయింది. మొత్తంగా ప్రాజెక్టులన్నీ పొటెత్తుతున్నాయి.

Also Read: సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్‌ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు

 హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త