ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు
దీని ప్రభావంతో మే 20, సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. మరోవైపు రేపు శ్రీకాకుళం 6, విజయనగరం 8, మన్యం 9, అల్లూరి జిల్లా చింతూరు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
మే 21 మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి పల్నాడు జిల్లా పెద్దకూరపాడు 55.5మిమీ, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి 40మిమీ, జగ్గయ్యపేట 39.5మిమీ, అల్లూరి జిల్లా అడ్డతీగల 38మిమీ, చింతపల్లి 36మిమీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2మిమీ,అనకాపల్లి రావికమతం 35.2మిమీ అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35మిమీ,తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.
మరోవైపు తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తమిళనాడులో నాలుగు జిల్లాలకు.. కేరళలో మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐతే ఇప్పటికే తమిళనాడులో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నామి. వాతావరణశాఖ కూడా 4 జిల్లాలకు రెడ్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కన్యాకుమారి, తేని, తిరునల్వేలి, తేంకాసి, ధర్మపురి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వరద ఉధృతికి జలపాతాలు మూసివేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు తప్పవని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అటు.. కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని పథనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో నేటి వరకు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. 24 గంటల్లో 20 సెంటిమీటర్ల కంటే ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. పలుచోట్ల కురిసిన వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో నీరు స్తంభించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.