Andhra News: ఇక మంటలే మంటలు.. మార్చిలోనే సుర్రుమంటున్న సూరీడు.. ప్రజలకు తీవ్ర హెచ్చరిక

ఏపీలో మార్చి నెల నుంచి భానుడు భగ భగలు మొదలయ్యాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా ఉండటం వల్ల జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ వివరాలు ఇలా.

Andhra News: ఇక మంటలే మంటలు.. మార్చిలోనే సుర్రుమంటున్న సూరీడు.. ప్రజలకు తీవ్ర హెచ్చరిక
Ap News

Updated on: Mar 02, 2025 | 7:45 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా శివరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాలో 38 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు వైద్యులు, అధికారులు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు .. సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని సూచిస్తున్నారు.

మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనుందని తెలిపింది. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీస్తాయంది. మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కవగా ఉంటుంది.  చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోనుంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. ఎండలపై సమాచారం కోసం విపత్తుల సంస్థ 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను పేర్కొంది. ప్రజలకు ఎప్పటికప్పుడూ వడగాల్పుల హెచ్చరిక సందేశాలు అందుతాయని తెలిపింది. తీవ్రమైన ఎండల సమయంలో ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి