Guntur: గుంటూరు కార్పోరేషన్ వినూత్న ప్రయోగం… అయినా మారని నగర పౌరులు

స్వచ్చాంద్రలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు కార్పోరేషన్‌లో.. సిబ్బందిని పెంచడంతో పాటు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.బహిరంగ ప్రదేశాల్లో ఉన్న డంపింగ్ బిన్స్‌ను ఎత్తి వేసింది. పుష్ కార్ట్స్‌తో చెత్త సేకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అయితే డంపింగ్ బిన్స్ వద్ద చెత్త పడేయడానికి అలవాటు పడిన స్థానికులు ఇంకా అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడవేస్తున్నారు. ఈ వ్యవహారం కార్పోరేషన్ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Guntur: గుంటూరు కార్పోరేషన్ వినూత్న ప్రయోగం... అయినా మారని నగర పౌరులు
Guntur Corporation Waste

Edited By:

Updated on: May 03, 2025 | 1:48 PM

ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్నారలో అక్కడ గ్రీన్ మ్యాట్ కడుతున్నారు. ఆ గ్రీన్ మ్యాట్‌‌కు ఒక పోస్టర్‌ అంటించారు. చెత్త పడవేయవద్దన్న పోస్టర్‌ను అంటించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే గ్రీన్ మ్యాట్ పెట్టిన చోట రెండు మూడు రోజుల పాటు ఎటువంటి చెత్త వేయకుండా ఉన్న స్థానికులు ఆ తర్వాత యథావిధిగా అక్కడే చెత్త పడేస్తున్నారు. గ్రీన్ మ్యాట్‌లను పడేసి మరీ అక్కడే చెత్త వేయడంతో సిబ్బంది ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని సూచించినా వినూత్న కార్యక్రమాలు చేపట్టినా..  మార్పు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక కార్పోరేషన్ సిబ్బంది తలలు పట్టకుంటున్నారు.

అయితే ప్రస్తుతం గ్రీన్ మ్యాట్‌లు పెట్టిన దగ్గరే సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిసి కెమెరాల సాయంతో చెత్త పడేసిన వారిని గుర్తించి వారికి భారీగా జరిమానా విధించాలన్న ఆలోచనలో కార్పోరేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రీన్ మ్యాట్‌ల వద్ద కూడా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతుండంతో అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే అవసరమైతే భారీగా ఫైన్‌లు వేసైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటును మాన్పించాలన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారు. ఈ ప్రయోగమైనా విజయవంతం అవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..