గుంటూరు, నవంబర్ 15: ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రూ.30 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నరలోనే తీర్పు రావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. గుంటూరు RTC కాలనీలోని గాంధీనగర్ కు చెందిన షేక్ జానీ కారు సీట్ల మరమ్మత్తు పనులు చేస్తుంటాడు. గుంటూరులో పనులు తక్కువుగా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే 2022 నవంబర్‌లో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో నవంబర్ 9వ తేదిన భువనగిరిలోని నిర్మలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు స్కానింగ్ చేయించాలంటూ రాయల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ కు పంపారు. రాయల్ డయాగ్నో స్టిక్స్ సెంటర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా 24 గంటల కడుపు నొప్పితో పాటు గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని రోగికి సూచించారు.
24 గంటల కడుపునొప్పితో పాడు గాల్ బ్లాడర్ తొలగింపు ఆపరేషన్లను రెండింటినీ ఒకేసారి నిర్వహించారు. అదే నెల 13వ తేదీన జానీని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తర్వాత రోజు నొప్పి ఎక్కువుగా ఉండటంతో తిరిగి నిర్మలా ఆసుపత్రికి జానీ వచ్చాడు. 5 రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు మరల డిశ్చార్జ్ చేసి పంపించారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన జానీ.. ఈసారి మానస ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఇన్పెక్షన్ ఉన్నట్లు చెప్పారు. దీంతో జానీని హైదరాబాద్ వెళ్లి మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు మానస ఆసుపత్రి వైద్యులు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో జానీని కుటుంబ సభ్యులు అదే నెలలో గుంటూరులోని జీజీహెచ్ కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే 2024 జనవరిలో జానీ చనిపోయాడు. అయితే నిర్మలా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జానీ చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు లాయర్ ద్వారా నోటీసులు పంపిచారు. అయినప్పటికీ ఆసుపత్రి వైద్యులు స్పందించలేదు. దీంతో వారు గుంటూరులోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. వాదనల అనంతరం కమీషన్ వైద్య ఖర్చుల కింద రూ.30 వేలు, నష్టపరిహారంగా రూ.30 లక్షలు, మానసిక ఒత్తిడికి గురిచేసినందుకు మరో రూ. పదివేలు కలిపి బాధిత కుటుంబానికి అందించాలని తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని 6 వారాల్లోగా చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. దీనిపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.