
రాత్రి పదకొండు గంటల తర్వాత ముఖానికి మాస్క్ పెట్టుకొని ఒక మహిళ గుంటూరు జనరల్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు వచ్చింది. అక్కడున్న రోగులతో మాట్లాడుతుంది. ఈ విషయాన్ని గమనించి స్థానిక సిబ్బంది బయటకు వెళ్లాలంటూ ఆ మహిళకు సూచించారు. అయితే ఆమె మాత్రం వార్డులన్నీ తిరుగుతూ రోగులను పలకరిస్తూ వివరాలు సేకరించడం మొదలు పెట్టింది. దీంతో సిబ్బంది ఆమె ఎవరా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. కొద్దిసేపటికే ఆమె గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అని అర్దమైపోయింది. దీంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.
జీజీహెచ్‌లో గత కొంతకాలంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ముఖ్యంగా రాత్రి వేళల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కూడా రాత్రి పదకొండు గంటల తర్వాత జీజీహెచ్‌కి సాధారణ రోగి బంధువులాగా వెళ్లి వివరాలు సేకరించారు. కొంతమంది రోగి బంధువులు కింద పడుకుని ఉండటాన్ని గమనించిన ఆమె రోగుల విశ్రాంతి భవనానికి వెళ్లాలంటూ సూచించారు. అదే విధంగా చికిత్స అందుతున్న విధానం గురించి రోగులను, రోగి బంధువులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకుపైగానే ఆమె జీజీహెచ్ వివిధ విభాగాలను పరిశీలించారు.
కలెక్టర్ అర్ధరాత్రి సమయంలో జీజీహెచ్‌కు వచ్చిన విషయం తెలిసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వివిధ వార్డుల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని, రోగులు, వారి బంధువుల అభిప్రాయాలను తెలుసుకునేందుకే కలెక్టర్ రాత్రి వేళ్లలో పర్యటించినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమైన అధికారులంతా జిజిహెచ్ పై దృష్టి పెట్టడంతో మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న భావన రోగుల్లో వ్యక్తం అవుతోంది. అయితే నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటేనే మరింతగా మార్పు వస్తుందన్న అభిప్రాయాలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగి బంధవుల నుంచి వస్తున్నాయి.