Guntur: సంచలనం.. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు ఉన్మాదికి ఉరిశిక్ష
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసుపై గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు శశికృష్ణకు ఉరి శిక్ష విధించింది.
Guntur B Tech Student Murder Case: గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణకు జిల్లా ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టు 15న రమ్య హత్యకు గురైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్యోదంతం సంచలనం రేపింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన తనను ప్రేమించడం లేదని శశికృష్ణ.. రమ్యను రోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమర్చాడు. గతేడాది డిసెంబరులో ప్రారంభమైన ఈ కేసు విచారణ ఈ నెల 26న ముగిసింది. కాగా తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక కామెంట్స్ చేశారు. అరుదైన కేసుల్లో అరుదైనదిగా దీన్ని పరిగణిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య చేశాడని.. ఇంత చేసినా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. విచారణ జరుగుతుండగానే కోర్టులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని… నిందితుడి మాటల్లో, వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదని జడ్జి తెలిపారు. తప్పు చేశాననే పశ్చాత్తాపం కనిపించని అతడికి ఉరి శిక్ష కరెక్ట్ అని భావిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
కేసు పూర్తి వివరాలు ఇవి…
గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యకు సోషల్ మీడియా ద్వారా కుంచాల శశికృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు అతడు ప్రేమ పేరుతో రమ్యని వేధించడం మొదలెట్టాడు. వేధింపులు తట్టుకోలేక.. రమ్య అతడి నంబర్‌ను బ్లాక్‌లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ ఆధారంగా శశికృష్ణను 24 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ ఫైల్ చేశారు. ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించారు. జడ్జి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. శుక్రవారం నిందితుడిని.. దోషిగా నిర్ధారిస్తూ.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని తీర్పునిచ్చారు.
కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు రమ్య కుటుంబ సభ్యులు. తమ కూతురికి న్యాయం జరిగిందన్నారు రమ్య తల్లి. అయితే, ఉన్మాదికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారామె. తన కూతురికి జరిగినట్లు మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదంటే ఉన్మాది శశికృష్ణకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలన్నారు. ఉరిశిక్ష అమలైనప్పుడే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందంటున్నారు రమ్య తండ్రి. ప్రభుత్వం, పోలీసుల కృషి వల్లే ఉన్మాదికి ఉరిశిక్ష పడిందన్నారు ఆయన.
ఉన్మాది శశికృష్ణకు ఉరిశిక్ష పడటం వెనక పోలీసుల టీమ్ వర్క్ ఉందన్నారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్. శశికృష్ణ నేరాన్ని ఆధారాలతో సహా నిరూపించామన్నారు. సరైన సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ ఫైల్ చేయడం వల్లే శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించిందన్నారు గుంటూరు ఎస్పీ. గుంటూరు ప్రత్యేక కోర్టు తీర్పుపై లాయర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు కూడా త్వరగా శిక్షను అమలు చేయాలని కోరుకుంటున్నామంటున్నారు. తనకు ఉరిశిక్ష పడుతుందని శశికృష్ణ ముందే ఊహించాడని అన్నారు ఎస్సై. అందుకే, పారిపోయే ప్రయత్నం చేశాడని, కానీ తాము చాకచక్యంగా పట్టుకున్నామన్నారు.
Also Read: టాలీవుడ్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు దుర్మరణం
రైతు పొలం దున్నుతుండగా బయటపడిన అద్భుతం.. ఆనందంలో అన్నదాత