రానున్న వెయ్యి సంవత్సరాలకు సిద్ధమవుతూ సుసిర్థ ఇంధన మార్గాన్ని భారత్ నిర్మిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తును పదిలపరిచేందుకు సౌర, పవన, అణు, జలవిద్యుత్‌పై భారత్ దృష్టి సారించిందని తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న నాలుగవ అంతర్జాతీయ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – రీ-ఇన్వెస్ట్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత్‌లో చమురు, గ్యాస్ నిల్వలు లేవని విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉన్నత శిఖరాలకు చేరడమే కాదు ఆ ఉన్నత శిఖరాలపై కొనసాగటం భారత లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. మూడు రోజుల ఈ సదస్సులో ఏపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ, పరిశ్రమ, ఆర్థిక రంగాలకు సంబంధించిన దాదాపు పదివేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ప్రధాని పరిశీలించారు. VR సెట్ ధరించారు.
తనపై ఎటువంటి ఒత్తిడి పనిచేయదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో భవిష్యత్ తరాలకు మేలు చేయాలని ఒత్తడి తనపై ఉందని అన్నారు. అవసరాలకు సరిపడా వనరులు మన దగ్గరున్నాయి కాని మన అత్యాశలకు అవి సరిపోవని తెలిపారు. నెట్ జీరో అన్నది ఫ్యాన్సీ పదం కాదని, అది భారత్ అవసరమూ, నిబద్ధత అని మోదీ అన్నారు.
రీ-ఇన్వెస్ట్ సదస్సులో ప్రసంగించిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వేదికపై ఆయనతో కరచాలనం చేసి ఏదో విషయాన్ని ఆయనకు వివరించారు. మైక్ శబ్ధం ఎక్కువ ఉండటంతో దగ్గరకు వచ్చిన మరీ ఆయనతో ఏదో చెప్పారు. దాదాపు 15 సెకన్లు పాటు చంద్రబాబుకు మోదీ షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు.
నాన్ రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో తాము భారీ స్థాయిలో వెళ్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గాంధీనగర్ రీ-ఇన్వెస్ట్ సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. నాన్ రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.