UPSC Civils 462nd Ranker: సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించిన ఒంగోలు అమ్మాయికి ఘన స్వాగతం.. ఐదో ప్రయత్నంలో గెలుపు

|

May 30, 2023 | 11:22 AM

యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు ఈనెల 23న తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 462వ ర్యాంకు సాధించిన ఒంగోలు యువతి బొల్లాపల్లి వినూత్నకు ఘనస్వాగతం పలికారు..

UPSC Civils 462nd Ranker: సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించిన ఒంగోలు అమ్మాయికి ఘన స్వాగతం.. ఐదో ప్రయత్నంలో గెలుపు
Civils Ranker Bollapalli Vinutna
Follow us on

యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు ఈనెల 23న తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 462వ ర్యాంకు సాధించిన ఒంగోలు యువతి బొల్లాపల్లి వినూత్నకు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీలో ఉన్న వినూత్న నేడు ఒంగోలుకు రాగా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. అనంతరం వేదిక ఏర్పాటు చేసి అభినందనలు తెలిపారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వినూత్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం లభించినా వెళ్లకుండా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో వినూత్న సివిల్స్‌పై దృష్టి సారించారు. పలుమార్లు ఫెయిల్‌ అయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో చదివి 5వ ప్రయత్నంలో విజయం సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం గుంటూరు జిల్లా నుంచి ఉద్యోగరీత్యా ఒంగోలుకు డాక్టర్‌ బొల్లాపల్లి రవి, డాక్టర్‌ సుభాషిణిలు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. డాక్టర్‌ రవి పశుసంవర్థక శాఖలో ఒంగోలు, కొండపి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం చదలవాడ పశుక్షేత్రం ఏడీగా ఉన్నారు. నగరంలో వివిధ వర్గాలకు సుపరిచితులు. డాక్టర్‌ సుభాషిణి వ్యవసాయ శాఖలో ఏడీ స్థాయిలో ఒంగోలులో పనిచేస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయి వినూత్న 2017లో బీటెక్‌ మెకానికల్‌ ను చెన్నై కాలేజీలో పూర్తిచేశారు. తొలి నుంచి చదువులో చురుగ్గా ఉండటంతోపాటు వ్యాసరచన, వక్తృత్వ ఇతర పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు పొందారు.

Civils Ranker Bollapalli Vinutna

సేవ చేయాలన్న తపనతోనే సివిల్స్‌పై దృష్టి

ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో వినూత్నకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ తాము పడే ఒత్తిడికి భిన్నంగా కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరడం మంచిదని తల్లిదండ్రులు సూచించినా ఆమె మాత్రం సివిల్స్‌ వైపు మొగ్గుచూపారు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఢిల్లీ వెళ్లి కోచింగ్‌ తీసుకొని అక్కడే ఉండి సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. అలా 2018 నుంచి 2022 వరకు వరుసగా ఐదు సార్లు రాశారు. రెండుసార్లు ప్రిలిమ్స్‌లో, మరో రెండుసార్లు మెయిన్స్‌లో వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు రెండేళ్లు కరోనా పరిస్థితులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా అనుకున్న లక్ష్యంపైనే దృష్టిసారించి పట్టుదలగా శ్రమించి 5వ ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.