ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం సోమవారం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిఠాపురం ఆస్పత్రి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది అందుబాటులోకి రానున్నారు.
ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వసతుల పెంపు కోసం రూ.38.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగించన్నారు. పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనపు విభాగాలు రానున్నాయి. పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి-ముక్కు-గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలలలోపునే అమలు కావడం సంతోషంగా ఉందంటున్నారు పిఠాపురం వాసులు. దీంతో పిఠాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల, సమీపం నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..