టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే జిల్లాకు పేరు పెట్టామని, ఐదేళ్లకు ఒకసారి మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ను గౌరవించే అలవాటు టీడీపీకి లేదన్న సజ్జల.. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పేరును ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు తెరమరుగు కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని, ఎన్టీఆర్ కు సీఎం జగన్ అత్యంత గౌరవం ఇచ్చారని చెప్పారు. ఎందుకు పేరు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ సభలో చెప్పారని వెల్లడించారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే కుమిలిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు లోలోపల సంతోష పడ్డారని విమర్శించారు. టీడీపీ హయాంలో వైఎస్సార్ విగ్రహాలు ఎందుకు తొలగించారన్న సజ్జల.. అధికారంలోకి వస్తామని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా.. శాశ్వత అధ్యక్ష తీర్మానాన్ని ప్లీనరీ చేసిందన్న సజ్జలు.. ఆ తీర్మానాన్ని అధ్యక్షుడు జగన్ తిరస్కరించారని చెప్పారు. అది ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయిందని, అందులో సందేహమేమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. విజయవాడలో ఎన్డీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసెంబ్లీని కుదిపేసింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నా.. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈబిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో టీడీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు.
ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ గౌరవమని, తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదని చెప్పారు. ఎన్టీఆర్ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదని, చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..