
అనకాపల్లి జిల్లాలో పండుగ వేళ జాలర్లను గంగమ్మ కరుణించింది. బోటులో చేపల పట్టేందుకు వెళ్లిన జాలర్లకు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు గోల్డెన్ ఫిష్ చిక్కాయి. అదేనండి కచిడి చేపలు. పలు రకాల మందుల తయారీలో కచిడి చేప పిత్తాశయం, ఊపిరితిత్తులను వాడుతారు. దాంతోపాటు కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో ఆపరేషన్ అనంతరం కుట్లకు వేసే దారాన్ని తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం టైం గడిచేకొద్దీ శరీరంలో కలిసిపోతుంది. అందుకే ఈ చేపలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఆడ చేపలు కంటే.. మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో కనిపిస్తాయని, అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అంటారని జాలర్లు చెబుతున్నారు. ఖరీదైన వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. తాజాగా చిక్కిన కచిడి చేపల్లో రెండు ఆడవి కాగా.. మరొకటి మగది. రెండు ఆడ చేపలు 40 వేలు పైన రేటు పలకగా.. మగ చేప.. 60 వేలుకు పైగా పలికింది. కాగా వేలానికి ముందు ఈ చేపల పొట్ట కోసి.. అవి ఆడవో, మగవో నిర్ధారించుకున్నారు. తర్వాత వేలం వేశారు.
కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్..కచిడి చేప ఎక్కడా ఓ చోట నిలకడగా ఉండదు. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అత్యంత అరుదుగా ఇవి వలలకు చిక్కుతాయి. ఈ చేప రెక్కలను మరికొన్ని పదార్థాలు ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగిస్తారని కూడా మత్య్సకారులు చెబుతున్నారు.