భగవంతుడిని భక్తితో ఆరాధిస్తాం.. శక్తీ కొద్ది పిండివంటలు, నైవేద్యాలు చేసి భగవంతుడు సంతృప్తిగా అరగించాడని విశ్వసించి వాటిని ప్రసాదంగా స్వికరిస్తాము. దీంతో పాటు పండుగ సమయాల్లో చిత్రపటాలను పూలదండలతో అలంకరించి భక్త తో అరాదిస్తాం. ఇక ధనలక్ష్మి సకల సంపదలను ఇచ్చే కల్పవల్లిగా భక్తులు భావిస్తారు. ఆమె పద్మంపై కూర్చుని బంగారు నాణాలను పట్టుకున్న కలశంతో కనిపిస్తుంటుంది. ఆమె సంపాదకు చిహ్నంగా భావిస్తుంటారు.
బంగారం , వెండి వస్తువులను కొనటం , వాటిని అమ్మవారికి అలంకరించటం సంపాదకు చిహ్నంగా భావిస్తుంటారు. ఇపుడు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలలో అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా పలుచోట్ల మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవార్లను కరెన్సీ నోట్లతో ఉత్సవ కమిటీలు అలంకరించారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గంగానమ్మ అమ్మవారినీ రూ.2.20 కోట్లతో అలంకరించారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రూ. 75 లక్షలతో అలంకరించారు.
దసరా ఉత్సవాలు సందర్భంగా పట్టణాలు గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలలో ప్రతి ఏటా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజుకొక ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అలంకరణలో భాగంగా అమ్మవారి విగ్రహాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు కరెన్సీ నోట్లతో అలంకరించడం పరిపాటిగా మారింది. అలా చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఏ లోటూ లేకుండా ధనం సమకూరుతుందని అర్చకులు చెబుతూ ఉంటారు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో గత సంవత్సరం ఉత్సవాలలో సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించారు.
ఈసారి మరో 20 లక్షలు అదనంగా చేర్చి రూ 2.20 కోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరించిన నోట్లన్నీ కొత్త కరెన్సీ నోట్ల కట్టలే.. ముందుగా రూ. 100, రూ. 200, రూ. 500 కొత్త నోట్ల కట్టలను, కరెన్సీ నాణేలను సైతం అలంకరణ కోసం సిద్ధం చేశారు.. అలా సిద్ధం చేసిన నోట్ల కట్టలను ప్రత్యేక పాత్రలలో ఉంచారు. వాటిని ఉత్సవ కమిటీ సభ్యులు కొన్ని నోట్ల కట్టలను అమ్మవారికి అలంకరించి మరికొన్ని వాటిని అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు పశ్చిమ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కరెన్సీ అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు.