Godavari Floods: కోనసీమలో గోదావరి ఉపనదువు పొంగిపొర్లుతున్నాయి. వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దాంతో కోనసీమ ప్రాంతాన్ని గోదావరి ముంచెత్తింది. పి.గన్నవరం మండలం ఊడిముడి లంక నదీపాయకు అడ్డుకట్ట తెగిపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కోనసీమలోని పలు లంకగ్రామాలకు ముప్పు పొంచిఉంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. కోనసీమలోని అధికారులకు సెలవులు రద్దు చేసింది. లంక గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, లంక గ్రామాల ప్రజలు నదీ పాయను పడవలో దాటుతుండగా.. ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో.. వారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. దాంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. ఆ వెంటనే పడవ సెట్ అవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఇదిలాఉంటే.. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతి కారణంగా కొబ్బరి చెట్లు నేలకొరుగుతున్నాయి. జిల్లాలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి నదీ తీర ప్రాంతంలో గోదావరి వరద ఉధృతి కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. నదీ కోత కారణంగా 9 కొబ్బరి చెట్లు వరద నీటిలో పడిపోయాయి. దాంతో బాధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరేళ్ళ పాటు ఎంతో శ్రమపడి పెంచి పెద్ద చేసిన కొబ్బరి చెట్లు.. రైతు కళ్ళ ముందే నదీ గర్భంలో కలసి పోవటం గుండె కోతే అని రైతులు బోరున విలపిస్తున్నారు. కొన్నేళ్లుగా వేలాది కొబ్బరి చెట్లు, వందలాది ఎకరాలు గోదావరి నది గుర్బంలో కలసి పోతున్నా కనీసం పట్టించుకునే వాళ్ళే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read:
Church Controversy: పాత ఫాదర్ వర్సెస్ కొత్త ఫాదర్.. ప్రార్థనల కోసం పోటా పోటీ..