
ఏలూరు, జనవరి 23: ఏడేళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే గంగానమ్మ జాతర చాలా ప్రత్యేకమైనది. జాతర సమయంలో అమ్మవారు నగర సంచారం చేయటం ఆనవాయితిగా వస్తుంది. గత జాతర వరకు తూర్పు వీధి, పడమరవీధులకు మాత్రమే పరిమితమైన ఈ జాతర వేడుకలు ఈ సారి నగరంలో మొత్తం ఏడుచోట్ల దేవతలను వుంచి పూజలు చేస్తున్నారు. దక్షిణపు విధి, లక్ష్మివారపు పేట, పవర్ పేట, తంగెళ్ళమూడి, అడివారపుపేట ఇలా మొత్తం ఏడు చోట్ల దేవతలను ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గంగానమ్మ, ఆది మాహాలక్షమ్మ, పోతురాజు బాబులకు ముడుపు కట్టడం, మేడల వద్దకు తీసుకురావటం, కుంభం పోయటం, సాగనంపటం అనే ఘట్టాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరిగా అమ్మవార్లను సాగనంపే కార్యక్రమం కన్నులపండుగగా జరుగుతుంది. ఈ జాతర ఉత్సవాలు గత ఏడాది అక్టోబర్‌లో మొదలవగా ఫిబ్రవరి 2తో ముగియనున్నాయి.
ఏలూరులో ప్రస్తుతం జాతర జరుగుతుండటంతో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక చిహ్నాలతో కూదిన ముద్రలు కనుపిస్తున్నాయి. వీటిని గోడ స్టిక్కర్స్ గా ఇంటి ముందు ప్రహరి గోడలకు అతికించారు. ఇందులో ప్రధానంగా శ్రీ గంగానమ్మ (ఎడమచేతి ముద్ర) కనిపిస్తుంది. దీనిని అమ్మవారి ఆశీర్వాద హస్తంగా భావిస్తుంటారు. అమ్మవారి అభయ హస్తం మధ్యలో బిందువు, అర్ధచంద్రాకారంలో ఉంటాయి. ఇవి అమ్మవారి కరుణ, దయ భక్తులపై ఉంచాలని సూచికగా ఏలూరు వాసులు నమ్ముతారు. గ్రామ దేవతల ఆరాధనలో ఇది అత్యంత శక్తివంతమైన ప్రతీక.
శ్రీ పోతురాజు బాబు (నడుమ భాగం – నిలువు ఆకృతి)గా భావించ బడుతుంది. పోతురాజు అంటే అమ్మవారి సేవకుడు, వీరుడు. చిత్రంలో కనిపించే నిలువు వరుసలో ఉన్న ఎర్ర బిందువులు శక్తి ప్రవాహం, తపస్సు, త్యాగం, వీరత్వంకు గుర్తులుగా చెప్పబడుతున్నాయి. కుడి వైపు వృత్తాకారం, మద్యలో మూడు అడ్డగీతలు వాటికి పైన కింద బిందువులు శ్రీ ఆదిమహా లక్ష్మి అమ్మవారికి ప్రతికలు. ఆది అంటే మూలం. సృష్టికి మూలమైన శక్తి. కనిపించే మూడు అడ్డగితలు త్రిగుణ రూపాలు. సృష్టి మొత్తాన్ని నడిపించే మూడు మౌలిక గుణాలనే త్రిగుణాలు అంటారు. అవే సత్వ, రజస్, తమస్.. ఈ గుణాలు మనిషి జీవితం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. శాంతి, ఓర్పుకు సత్వ గుణం.. చలనం, కోరిక, ఆశలకు రజస్ గుణం.. ఇక తమస్ గుణంకు అజ్ఞానం, అలసత్వం, అంధకారం అని అర్ధం. సత్వ–రజస్–తమస్ అనేవి మతపరమైన పదాలు మాత్రమే కాదు. ఇవి మన జీవితానికి మార్గదర్శకాలు కూడా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.