
కామ్రేడ్ పెంచలయ్య.. సీపీఎంలో యాక్టివ్‌గా ఉండే ఓ సాధారణ కార్యకర్త. పెంచలయ్య గురించి వారం క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. గత శనివారం నెల్లూరులోని పెంచలయ్య నివాసం ఉంటున్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో కాపు కాసి పది మందికి పైగా ఉన్న గ్యాంగ్ కత్తులతో నరికి చంపింది. ఆరోజు అది ఒక హత్య కేసు మాత్రమే.. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో.. ఆ కాలనీ మొత్తం తమ ఇంటి బిడ్డను కోల్పోయినట్లు విషాదంలో మునిగిపోయింది. ఆతర్వాత పెంచలయ్య గురించి అసలు విషయాలు తెలుసుకున్న ఈ సమాజం మొత్తం మా ఇంటి మనిషిని కోల్పోయినట్టుగానే భావించింది. పెంచలయ్య చేసిన పోరాటం.. ఆయన చేసిన మంచి పనులు తెలుసుకున్న ప్రతి కుటుంబం హత్యకు పాల్పడ్డ వారిపై ఆగ్రహంతో రగిలిపోయింది.
ఇటీవల కాలంలో పల్లె, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా గంజాయి రవాణా, అమ్మకం, వినియోగం కామన్ అయి పోయాయి. దీంతో నేర ప్రవృత్తి కూడా పెరిగిపోతోంది. ఇలాంటి వాటిని కఠినంగా అణిచి వేయాలని ప్రభుత్వాలు చూస్తున్నా… వ్యవస్థలోని కొందరు అవినీతి అధికారుల వల్ల గంజాయి దందా చేస్తున్న మాఫియా ఆగడాలకు చెక్ పెట్టలేకపోతున్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో మనకెందుకు వచ్చింది అని.. గంజాయి బ్యాచ్ ఆగడాలకు బయపడి మిన్నకుండిపోతున్నారు. అయితే నెల్లూరులోని పెంచలయ్య మాత్రం అలా అనుకొని ఉండలేదు.. గంజాయికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించాడు.. అవగాహన కార్యక్రమాలు చేపట్టాడు.. అలవాటు పడ్డ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చాడు.. గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠాలకు వార్నింగ్ ఇచ్చాడు.. విచ్చలవిడిగా పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా గంజాయి అలవాటు చేస్తున్న గ్యాంగ్‌కు ఎదురు నిలబడ్డాడు. తమ దందాకు అడ్డువస్తున్నారన్న కారణంతో కక్ష పెంచుకున్న ముఠా పెంచలయ్యను కాపు కాసి.. అత్యంత దారుణంగా నరికి చంపింది. పెంచలయ్య బలయింది తన కుటుంబం కోసం.. తన పిల్లల కోసం కాదు.. తమ ప్రాంతంలోని అందరి భవిష్యత్తు కోసం. అన్ని కుటుంబాలు బాగుండాలని పోరాటం చేసి గంజాయి బ్యాచ్ చేతిలో బలైపోయాడు.. పెంచలయ్య నివాసం ఉంటున్న హౌసింగ్ బోర్డ్ ఆర్టీడీ కాలనీ వాసులే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనం అతని త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి పెంచలయ్య నివాసానికి వెళ్లి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. పెంచలయ్య ఇద్దరు పిల్లల చదువు బాధ్యతలను తన కుమార్తెలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పెంచలయ్య ఉద్యమం చేసిన ఆర్టీడీ కాలనీ అభివృద్ధికి 50 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పెంచలయ్య పోరాటం 10 మందికి స్ఫూర్తిని నింపేలా.. ఆయన గుర్తుగా పెంచలయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు. సిపిఎంలో ఓ సామాన్య కార్యకర్త, సామాన్య కుటుంబానికి చెందిన పెంచలయ్య విగ్రహం ఏర్పాటు చేయడమంటే సాధారణ విషయం కాదు. అయితే చిన్న వయసు నుంచి పెంచలయ్య సమాజం పట్ల ఉన్న బాధ్యత, అందుకోసం చేసిన త్యాగం ఆయనకు గుర్తింపును తెచ్చిందని స్థానికులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటనపై స్పందించారు.. పెంచలయ్య భార్య దుర్గకు ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం నుంచి భూమి ఇస్తామన్నారు.