AP Free bus scheme: ఏపీలో ఉచిత బస్ ప్రయాణం త్వరలోనే.. కర్ణాటక సీఎంను కలిసిన ఏపీ మంత్రుల బృందం

|

Jan 04, 2025 | 11:21 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటిస్తోంది..

AP Free bus scheme: ఏపీలో ఉచిత బస్ ప్రయాణం త్వరలోనే.. కర్ణాటక సీఎంను కలిసిన ఏపీ మంత్రుల బృందం
Home Minister Anitha
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని త్వరలోనే నెరవేరుస్తామని హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటిస్తోంది.. ఈ సందర్భంగా ఉచిత బస్ ప్రయాణం గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు హోంమంత్రి అనిత తెలిపారు.. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను విజయవంతంగా అమలుచేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఉచిత బస్ ప్రయాణం.. పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఏపీ రవాణా శాఖ మంత్రి నేతృత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి హోంమంత్రి అనిత బెంగళూరులోని శాంతినగర్ బస్ డిపోను పరిశీలించారు. అనంతరం డిపోలోని కొత్త బస్‌లో ప్రయాణించి ప్రయాణికులతో హోంమంత్రి ముచ్చటించారు. ఈ పథకం ద్వారా మహిళలకు కలిగిన లబ్ధి గురించి వారినే నేరుగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ..ఆర్థిక లోటున్నా మహిళా సాధికారతకే మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సూపర్ సిక్స్ హామీలలో కీలకమైన ఈ పథకం అమలులో భవిష్యత్ లో లోటుపాట్లు రాకూడదనే సీఎం ఆదేశాల ప్రకారం అధ్యయనం చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

కర్ణాటక రవాణా శాఖ ఉన్నతాధికారులతో స్మార్ట్ టికెట్ విధానం గురించి చర్చించినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం పథకాన్ని అమలుచేస్తోన్న తీరును అన్ని కోణాలలో నిశితంగా పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సందేహాలను అడిగి తెలుసుకున్నామన్నారు.

ఈ సందర్భంగా జీరో, స్మార్ట్ టికెట్ విధానంపై చాలా వరకూ స్పష్టత వచ్చిందని అనిత తెలిపారు. పథకం అమలు తొలిరోజుల్లో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు,ఇబ్బందులపై హోంమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి సమగ్ర నివేదికను త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..