కాదేది మోసానికి అనర్హం అన్నట్లు పరిస్థితి ఉంది. అడ్డదారిలో డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పోలీసులను బురిడి కొట్టించి మరీ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఇలాంటి ఓ వెరైటీ మోసం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువులకు నకిలీ తయారు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి బలి చేస్తూ నకిలీ ఫుడ్‌ను తయారు చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. అయితే కేవలం తినే వస్తువులే కాదు. వ్యవస్థలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కల్తీగాళ్లు. తాజాగా ఆదోని పట్టణానికి చెందిన కొందరు ఏకంగా నకిలీ అధికారుల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్నారు. ఆర్టీవో అధికారుల అవతారం ఎత్తి వాహనదారుల నుంచి డబ్బులు దోచుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొందరు కేటుగాళ్లు నకిలీ ఆర్టీవో అధికారుల రూపం ఎత్తారు. రోడ్డుపై నిజమైన ఆర్టీవో అధికారుల మాదిరిగా అవతారమెత్తి వాహనాలను ఆపారు. అనంతరం పత్రాలను చూపించాలంటూ అడుగుతున్నారు. వాహనానికి పత్రాలు సరిగ్గా లేవని లక్ష రూపాయలు ఇస్తే వదిలేస్తాం లేకపోతే వాహనాలు సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. లారీ డ్రైవర్‌లను, క్లీనర్‌లను బెదిరిస్తూ దందా సాగిస్తున్నారు.
వారి వ్యవహారం తేడా కొట్టడంతో బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను నకిలీ అధికారులుగా తేల్చారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ నగర్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు వన్ టౌన్ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..