Sucharitha Meets CM YS Jagan: మాజీ హోంమంత్రి అలక వీడారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు ఆంధ్ర ప్రదేశ్ తాజా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ZPTC నుంచి హోంమంత్రిగా ఎదగడానికి జగనే కారణమన్నారు. జగన్ శ్రేయోభిలాషిగా వైసీపీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌దేనన్నారు. రాజీనామా చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాను పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదన్నారు సుచరిత. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభానులను బుజ్జగించిన సీఎం జగన్ ఇవాళ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సహా పలువురు ఎమ్మెల్యేలను నచ్చజెప్పారు.
మంత్రి పదవి దక్కక అలకబూనిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను పార్టీ పెద్దలు కలవకపోవటం ఆమె అభిమానులు, నియోజకవర్గ పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు రెండు రోజుల నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఆమె నివాసానికి వచ్చి ‘సామాజిక సమీకరణాల వల్ల చోటు కల్పించలేకపోయామని, మీకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని’ నచ్చజెప్పి వెళ్లారు. అది మినహా తిరిగి ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి వచ్చి మాట్లాడిన పెద్దలు లేరని ఆమె వర్గీయులు అగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీలో కొనసాగుతానని చెప్పారు. ఇంత జరిగినా పార్టీ వైపు నుంచి ఎలాంటి పలకరింపు లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి రమ్మన్నారని, అయితే అనారోగ్యం కారణంగా కలవటానికి వెళ్లలేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. కేబినెట్‌లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై సుచరిత విరుచుకుపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.
Read Also…. Bandi Sanjay: అక్బర్ కేసు కొట్టివేత ప్రభుత్వ వైఫల్యమే.. చిత్తశుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలిః బండి సంజయ్