ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 25: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా శ్రావణ మాసం శోభే కనిపిస్తోంది. పైగా ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఆ కల మరింతగా కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు అన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.. దీంతో రేట్లు సైతం రెట్టింపు అవుతున్నాయి. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతంతో బెజవాడలోని పూల మార్కెట్ రద్దీగా మారింది. కొనుగోలుదారులతో విజయవాడలోని పూల మార్కెట్లు అన్ని కిక్కిరిసి పోయాయి. సీజన్ కావటం అందులోనూ శ్రావణ మాసం కావడంతో పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏ పూలు కొనాలన్నా పావు కిలో ధర రూపాయల 100 పై మాటే. పావు కిలో చామంతి ,గులాబీ ఏదైనా 100 రూపాయల పైనే.. ఇక కేజీ పువ్వులు కొనాలంటే 400 రూపాయలు..
అలాగే సన్న జాజులు, కనకాంబరం అయితే కేజీ 600 రూపాయలు ఉన్నాయి. రెండు రోజుల ముందు వరకు కూడా 20 -30 రూపాయలు ఉన్న ధరలు ఒక్కసారిగా పెంచేశారు వ్యాపారులు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభతో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400వందలు పలుకుతున్నాయి. దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కడియం హోల్సేల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీ 500 వరకు పలుకుతుంది.
అయితే గత రెండు నెలలుగా అధిక ఆషాడం కావడంతో ధరలు లేక నష్టాలు చూశారు పూల వ్యాపారులు. శ్రావణ మాసం సందర్భంగా ధరలు కొన్ని రోజులు నిలకడగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. బహిరంగ మార్కెట్లో పూలకు అధిక రేటు ఉండడంతో 10 , 20 రూపాయలు లాభాలకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుందని రాజమండ్రి జాంపేట పూల వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు అధిక ధరలతో పూలు కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..