Godavari: గోదావరిలో పులస పక్కనబెట్టండి.. చేప నలుసు కూడా చిక్కట్లా..! ఎందుకిలా

వేదంలా ఘోషించే గోదావరి.. ఇప్పుడు మత్స్యకారుల గుండెల్లో ఆవేదనలా ఉప్పొంగుతోంది. పులస చేపకు వాల్డ్‌ ఫేమసైన గోదావరి తీరంలో మచ్చుకైనా మచ్చీ కన్పించడంలేదు. ఎందుకని ఈ కరువు..చేపలకు ఎరువులేకనా? గోదారి గట్టున అసలేం జరుగుతోంది.చేపలేదారి పట్టాయి?. మిచ్చీ మిస్సింగ్‌ వెనక మిస్టరీ ఏంటి?

Godavari: గోదావరిలో పులస పక్కనబెట్టండి.. చేప నలుసు కూడా చిక్కట్లా..! ఎందుకిలా
Godavari River

Updated on: Nov 06, 2025 | 10:11 PM

ఉప్పొంగే గోదావరి గలగలా పారుతూనే ఉంది. కానీ ఎప్పట్లా ఈసారి మత్స్య కళ మచ్చుకైనా లేదు. పడవలు తిరుగుతున్నాయి..వలలు విసురుతున్నారే కానీ పులస కాదుకదా, కనీసం చేప నలుసు కూడా కన్పించడంలేదు.

పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు తర్వాత కడాన యానాం, అంతర్వేది, నర్సాపురం వరకు గోదావరి పాయల్లో మత్య్స సంపదపైనే వేలాది కుటుంబాలు ఉభయగోదావరి జిల్లాల్లో బ్రతుకుతున్నా యి . ఐతే వేలేరుపాడు నుంచి ధవళేశ్వరం, విజ్జేశ్వరంతో పాటు పలు చోట్ల ఇపుడు ఇసుక ర్యాంపులు వచ్చేశాయి. దీనికి తోడు మర పడవలపై నదిలోకి వెళ్లి ఇసుక తోడి ఒడ్డుకు చేర్చే వ్యాపారం ఓ వ్యవస్థలా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్, జెసిబిలు కదలికలతో గోదావరి అల్లకల్లోలంగా మారటంతో చేపలు మాయం అవుతున్నాయి.  ఉభయగోదావరిజిల్లాలో మత్స్యాకార కుటుంబాలకు చేపలే జీవనాధారం. కానీ ఇప్పుడు చేపల్లేక గోదారి తీరం బోరుమంటోంది.

ఇసుక రీచ్‌ల విధ్వంసం..బోట్ల శబ్ద కాలుష్యం వల్ల చేపలు మటుమాయం కావడంతో..మరో గత్యంతరం లేక మత్స్యకారులు వలస వెళ్తున్నారు. తిరిగొచ్చేసరికి ఫిషర్‌మెన్‌ లైసెన్స్‌ గల్లంతవుతుందని వాపోతున్నారు. లైసెన్స్‌ లేకపోతే తమకు ప్రమాద బీమా, ప్రభుత్వ పథకాలు అందడంలేదనేది జాలర్లా ఆవేదన.

ఐతే మత్స్యకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. జాలర్ల కుటుంబాలకు నిత్యాసవర సరుకులు అందించారు. లైసెన్స్‌ విషయంలో కూడా న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.

సర్కార్‌ వారి సాయంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లను కట్టడి చేయడం సహా ఐతే మత్స్య సంపద పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.