దేశంలోనే స్పెషల్‌… కడప కారాగారం

|

Feb 29, 2020 | 1:54 PM

ఖైదీలలో సత్ప్రవర్తన దిశగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే దేశంలోనే కడప కారాగారం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కడప జైలులో...

దేశంలోనే స్పెషల్‌... కడప కారాగారం
Follow us on

ఖైదీలలో సత్ప్రవర్తన దిశగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందుకోసం ఖైదీలకు పలు విభాగాల్లో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఖైదీలంతా ఉపాధి పోందే విధంగా కారాగారాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పుతోంది.. అందులో భాగంగానే దేశంలోనే కడప కారాగారం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోబోతుంది.

కడప కారాగారంలో దేశంలోని తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత. ఈ సందర్భంగా జిల్లాలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అనంతరం జిల్లా పోలీసుల సేవా కార్యక్రమాల పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మనదేశంలో ఏ జైలులోనూ ఇప్పటివరకు స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ లేదని మొదటి సారిగా కడప జైలులో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా ఉపాధి పొంది ఉన్నత జీవితం గడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఖైదీలను సోదరా భావంతో చూడాలన్నారు మంత్రి సుచరిత.. జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖైదీలు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని , ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్‌లోని వస్తువులతో పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చిందని మంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఆమె పరిశీలించారు. మరోవైపు.. మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిశా చట్టంలో భాగంగా విశాఖలో పోరెనిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.