అమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన సీబీఎస్‌ఈ, టోఫెల్ అమలుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ, టోఫెల్ మంచి చెడులపై లోతుగా అధ్యయనం చేసి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తమ నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం సీబీఎస్‌ఈ, టోఫెల్ విధానాలను హడావుడిగా తెచ్చి అమలు చేసిందని, అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధంగా లేరని ఆయన గురువారం విలేకరులతో తెలిపారు. ఈ నేపథ్యంలో వాటి అమలుకు సంబంధించి మంచి చెడులపై అధ్యయనం చేశాకే ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. అనంతరం తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్ధికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం, నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధివిధానాలను పరిశీలిస్తామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.
నీట్ పీజీ ద్వారా ఇన్‌సర్వీస్ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (జులై 25) ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్-క్లినికల్ కేటగిరీ విభాగాల్లో 30 శాతం సీట్లను మాత్రమే భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులను 2024-25 విద్యా సంవత్సరంలో అమలుచేస్తామని వివరించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్పెషాలిటీల వారీగా భర్తీ చేసే సీట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. క్లినికల్ విభాగంలో 15 శాతం, నాన్-క్లినికల్ విభాగంలో 30 శాతం మించకుండా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. అలాగే పీజీ పూర్తిచేసిన అభ్యర్ధులు పదేళ్లపాటు విధిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారంగా వ్యవహరించని వైద్యుల అర్హత సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం యూనివర్సిటీకి ఉంటుందని, అంతేకాకుండా అటువంటి వారికి రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.