
దసరా పండుగ ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పల్లె నుండి పట్టణానికి వచ్చిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దసరా పండుగ రోజు సరదాగా గడిపేందుకు కొత్త బట్టలు, సరుకుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పత్తికొండ పట్టణం గుత్తి సర్కిల్ సాయిబాబా గుడి రోడ్డులో పండుగ సరుగుల కోసం వచ్చిన ముగ్గురు అనుకోని ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన శిరీష, భూమిక, మితుకలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన శిరీష, భూమిక, మితుకలు పండుగ సరుకుల కోసం పత్తికొండకు వచ్చారు. పండుగ, సరుకులు తీసుకుని తమ గ్రామమైన ముక్కెళ్ల గ్రామానికి వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. అప్పుడే బియ్యం లోడుతో మిట్టపై వెళ్తున్న లారీ వేగంగా వచ్చింది. బ్రేకులు ఫెయిలవడంతో పైభాగం నుండి కింది భాగంలో ఉన్న ఆటోలను లారీ ఢీకొట్టింది. దీంతో శిరీష భూమిక, మితుకలు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
భూమిక కుమార్తె మితుక, కుమారుడితో పండుగ సరుకుల కోసం కుటుంబంతో వచ్చింది. భూమిక అమె కూతురు మితుక చనిపోగా, ఏడాది వయస్సు ఉన్న బాబు బ్రతికి బయటపడ్డాడు. చనిపోయిన భార్య భూమిక, కూతురు మితుకలను చూసిన భర్త సుమన్ తల్లిడిల్లిపోయాడు. ఒకేసారి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..