
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కూచికాయలపూడి గ్రామానికి చెందిన రైతు అడుసుమిల్లి దాసు వయసు 75 సంవత్సరాలు. గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. జీవితమంతా పొలంలో శ్రమిస్తూ సాధారణ రైతుగా జీవించిన దాసు.. చివరి వరకు సాదాసీదా జీవితమే గడిపారు. డబ్బు, హోదా లేని జీవితం అయినా ఆయన మనసు మాత్రం ఎంతో పెద్దది. తన మరణాంతరం దేహదానం చేయాలన్న కోరికను ఆయన ముందే భార్య పిల్లలకు స్పష్టంగా చెప్పాడు. నేను చనిపోయాక నా దేహం మట్టిలో కలిసిపోకుండా ఎవరికైనా ఉపయోగపడితే చాలు అన్న.. ఈ రైతు మాటలు ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.
దాసు మృతి చెందిన వెంటనే ఆయన ఆశయాన్ని గౌరవించిన కుటుంబ సభ్యులు వెంటనే చర్యలు తీసుకున్నారు. భార్య ప్రమీల దేవి , కుమార్తె కంభంపాటి అపర్ణ దేవి-సతీష్ దంపతులు.. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది గ్రామానికి వచ్చి ఆయన రెండు కార్నియాలను స్వీకరించారు. దీంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఏర్పడింది..
అలాగే మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్య కళాశాల సిబ్బంది ఆయన సంపూర్ణ దేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం తీసుకెళ్లారు. ఒక సాధారణ రైతు చేసిన ఈ దానం భవిష్యత్తులో ఎంతోమంది వైద్యులకు ఉపయోగపడనంది. ఈ విషయం గ్రామంలో తెలిసిన వెంటనే కూచికాయల పొడి గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు. దాసు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆశయాన్ని నెరవేర్చిన కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు, స్థానికులు అభినందించారు.. మరణాంతరం కూడా సమాజానికి ఉపయోగపడిన వ్యక్తిగా ఆయన గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు.
సాధారణంగా పల్లెల్లో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో దాసు తీసుకున్న నిర్ణయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. చిన్న గ్రామానికి చెందిన సాధారణ రైతు అయినా ఆలోచనలో మాత్రం ఎంతో ఉన్నతంగా నిలిచారు. జీవితం ముగిసినా.. తన దానంతో మరికొందరి జీవితాలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా అడుసుమిల్లి దాసు గ్రామ చరిత్రలో నిలిచిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి