ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్..

నెల్లూరులో ఓ కుటుంబం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో జరిగిన 145 గ్రాముల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి ముందు వాషింగ్ మెషీన్‌పై తాళం ఉంచే అలవాటును గమనించిన నిందితులు, అదే తాళంతో ఇంట్లోకి ప్రవేశించి లాకర్‌లోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు బాల నేరస్తులతో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఏం కాదులే అని ఇంటి తాళాలు ఎక్కడపడితే అక్కడ దాస్తున్నారా..? ఇది తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్..
Nellore Gold Theft Case
Image Credit source: AI Photo

Edited By:

Updated on: Jun 11, 2026 | 3:26 PM

అన్నీ సవ్యంగానే ఉన్నాయి.. పిల్లలను ట్యూషన్‌కు పంపించారు.. ఇంటికి తాళం వేసి వాకింగ్‌కు వెళ్లారు. కానీ, తిరిగి వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే ఒక్కసారిగా షాక్ తిన్నారు. బీరువా తెరిచి ఉంది.. లాకర్ ఓపెన్ అయి ఉంది. అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు.. ఇంట్లో వస్తువులు చిందరవందరగా కూడా లేవు. మరి దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారు? 145 గ్రాముల బంగారం ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలకు చిన్న బజార్ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరి వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షేక్ అజ్మత్ కుటుంబం పిల్లలను ట్యూషన్‌కు వదిలి వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు అలవాటుగా ఇంటి ముందు ఉన్న వాషింగ్ మెషీన్‌పై తాళం ఉంచారు. ఈ అలవాటును ముందుగానే గమనించిన నిందితులు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇంటి ముందు ఉంచిన తాళాన్ని తీసుకుని ఇంట్లోకి ప్రవేశించిన వారు నేరుగా బెడ్‌రూమ్‌లోని బీరువా, లాకర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. లాకర్‌లో భద్రపరిచిన సుమారు 145.300 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు బీరువా, లాకర్ తెరిచి ఉండటాన్ని గమనించి పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Nellore Gold Theft Case

కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చిన్న బజార్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితుల కదలికలను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో ఇద్దరు బాల నేరస్తులతో పాటు మరో ఇద్దరు యువకులు ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి తాళాలను బయట కనిపించే ప్రదేశాల్లో ఉంచడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని, విలువైన వస్తువుల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us