వింత వ్యాధితో వణికిపోయిన ఏలూరు క్రమ క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వింత వ్యాధితో నగర వ్యాప్తంగా మొత్తం 650 మంది వరకు అస్వస్థకు గురి కాగా, వీరిలో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వారంతా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే డిశ్చార్జ్ అయిన వారిని వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరీక్షిస్తోంది. వారి ఆరోగ్య వివరాలను సైతం తెలుసుకుంటోంది. ఇప్పటికే అస్వస్థకు గురైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఆరోగ్య సర్వే చేపట్టారు. సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నిత్యం ఏలూరు వాసులపై పర్యవేక్షణ ఉంచుతున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తాత్కాలిక వైద్య శిబిరాలు ఇంకా కొనసాగుతున్నాయి.
మరోవైపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ధైర్యం చెప్పింది. అయితే మంచినీళ్లు తాగేందుకు భయపడుతున్న ప్రజలకు ప్రత్యేకంగా ఆర్వో వాటర్ సరఫరా చేస్తోంది. ఇక వలంటీర్ల ద్వారా నిత్యావసరలను కూడా ఇంటింటికి సరఫరా చేస్తోంది. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం అందించాలని సూచించింది. ఇక డిప్యూటీ సీఎం ఆళ్ల నాని బృందం ప్రతినిత్యం బాధితులకు అందుబాటులో ఉంటూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇంకా వీడని మిస్టరీ
వింత వ్యాధి అదుపులోకి వచ్చినా.. వ్యాధి ఎందుకు వచ్చింది అనేదానిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఢిల్లీ ఎయిమ్స్, హైదరాబాద్ లోని ఎన్ ఐఎన్, సీసీఎంబీ, డబ్ల్యూహెచ్ వో లాంటి సంస్థలు శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రజలు అస్వస్థకు గురైన ప్రాంతాల్లో నీరు, పాలు, కూరగాయాలు, ఆహార పదార్థాల శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. వాటిని పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే నీటిలో ప్రమాదకర స్థాయిలో రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే ఈ ఘటనపై నిపుణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై చర్చించారు.
ముప్పు తప్పినట్లేనా..?
కాగా, ప్రస్తుతం కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గండం గడిచినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. సహజ వనరులు కలుషితం కావడం వల్లే ఇలా జరిగినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. వంటలు, నీటి శుద్దిలో రసాయనాల వినియోగం తగ్గిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావదని సూచిస్తున్నారు. అయితే అస్వస్థకు గురికావడానికి సరైన కారణాలు తెలియకపోయినా.. సాగు, తాగునీరు, కల్తీ ఆహారం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుందని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు నిపుణులు.