విశాఖపట్నం, ఫిబ్రవరి 9: ఎలక్ట్రిక్ బైక్.. చార్జింగ్ పెట్టారు. రెండు గంటలు గడిచింది. ఒక్కసారిగా పేలుడు.. భారీ శబ్దం.. అందరూ అలర్ట్ అయి వచ్చేలోపే.. భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. ఆర్పే సాహసం ఎవరు చేయలేదు. ఎందుకంటే కరెంటు తీగలు కూడా అక్కడ ఉన్నాయి. పక్కనున్న మీటర్లు కూడా కాలిపోతున్నాయి. ఆ భవనం నుంచి భయంతో బయటకు వచ్చేసారు. చుట్టుపక్కల వారంతా పరుగులు తీశారు. చివరకు… ఏం జరిగిందంటే! ఈ మధ్యకాలంలో మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా.. జనాలు కూడా కొత్త కొత్త వాటిపై ఆశలు పెట్టుకుంటున్నారు. వస్త్రాలు, వాహనాలు.. ఒకటి ఏంటి..? ట్రెండ్ కు తగ్గట్టుగా తమ అభిరుచులను మలచుకొని అనుభవిస్తున్నారు. బైకుల విషయంలో కూడా.. పెట్రోల్ తో నడిచే వాహనాలపై ఆసక్తి తగ్గించి.. ఎలక్ట్రికల్ బైక్ లపై మోజు పెంచుకుంటున్నారు. అంతా సాఫీగా సాగితే ఓకే.. కానీ వాటి వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తేనే.. గుండెలు పట్టుకోక తప్పదు. విశాఖలో తాజా జరిగిన ఘటన స్థానికులను పరుగులు పెట్టించింది.
విశాఖ.. 90 వార్డు బుచ్చిరాజుపాలెం సీతారామరాజు నగర్ లో అపూర్వ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అపూర్వ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న సంతోష్ కుమార్.. భవనం సెల్లార్లో తన బ్యాటరీ టూ వీలర్ ( ఎలక్ట్రిక్) వాహనం చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ జరుగుతుండగా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. రెండు గంటలు గడిచింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు.. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు లోనికి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం దాటికి పక్కనే ఉన్న మీటర్లు కూడా కాలిపోయాయి. దీంతో ఆ భవనం నుంచి జనమంతా బయటకు వచ్చేసారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ప్రమాద తీవ్రత, మంటలకు భయపడి భారీగా గుమి గూడారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బైక్ పూర్తిగా దగ్ధం అయిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.