
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని కొలిచే భక్తులకు పెద్ద తిరుపతి తరువాత అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల. పెద్ద తిరుపతిలో సమర్పిస్తామనుకున్న మొక్కులను సైతం వీలు కుదరని వారు.. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకాతిరుమలలో స్వామివారికి చెల్లించుకుంటారు. అందుకే ఇక్కడి వెంకటేశ్వరస్వామిని చిన తిరుపతి వెంకన్నగా, చిన వెంకన్నగా భక్తులు కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి నిత్యం భక్తులు భారిగా తరలివస్తారు. మొక్కులు చెల్లిస్తారు. చిన వెంకన్న దర్శనం కొసం ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి ఆలయం తూర్పు ప్రాంతంలో మొబైల్ కౌంటర్ సమీపంలో ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు సహాయంతో భక్తులకు ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వంటి సేవలను భక్తులకు చేరువ చేసారు.
చిన్న వెంకన్న ఆలయంలో కూడా ఆన్ లైన్ సేవలు అమలు కావడంతో విశేష స్పందన లభిస్తుంది. స్వామి వారి దర్శనం టిక్కెట్లు 100, 200తో పాటు అంతరాయ దర్శనం 500 టిక్కెట్లు, నిత్య ఆర్జిత కళ్యాణం, ప్రసాదం, వసతి టికెట్లను అధిక శాతం భక్తులు ఆన్లైన్లో పొందుతున్నారు. గోపూజ, గరుడసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, కుంకుమార్చన, సహస్త్ర దీపాలంకరణ సేవ, స్నపన టికెట్టు విక్రయాలు ఆన్లైన్లో తక్కువగా జరుగుతున్నాయి.
పారదర్శకమైన, వేగవంతమైన సేవలను భక్తులకు అందించడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని దేవాలయాల అధికారులకు సూచించారు. ఈ క్రమంలో చిన్న తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.
మనమిత్ర వాట్సాప్ 9552300009 నెంబర్కు హాయ్ అని పంపి ఆలయంలో అన్ని సేవలు పొందవచ్చు. అలాగే www.aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా, ఏపీ టెంపుల్స్ యాప్ ద్వారా శ్రీవారి దర్శనం ప్రత్యక్ష పరోక్ష సేవలు ప్రసాదం ఇతర ఆన్లైన్ సేవలను సులభంగా పొందవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్, మనమిత్ర, వాట్సాప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం, సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.