Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. టికెట్ ధరల్లో మీరు ఇది గమనించారా?

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. సంక్రాంతి కానుకగా..

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. టికెట్ ధరల్లో మీరు ఇది గమనించారా?
Vander Bharat Express (File Photo)
Image Credit source: TV9 Telugu

Updated on: Jan 15, 2023 | 5:42 PM

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. సంక్రాంతి కానుకగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. జనవరి 16 నుంచి ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్న ఈ ట్రైన్ టికెట్ ధరల్లోని వ్యత్యాసాన్ని మీరు గమనించారా.? ఒకవేళ లేదంటే.. ఓసారి ఇది లుక్కేయండి..

సికింద్రాబాద్-విశాఖ, విశాఖ-సికింద్రాబాద్ టికెట్‌ ధరలను గమనిస్తే.. మీరు స్వల్ప వ్యత్యాసాన్ని చూడవచ్చు. సాధారణంగా అప్ అండ్‌ డౌన్‌ ట్రైన్‌ టికెట్‌ ధరలు ఒకేలా ఉంటాయి. కానీ ఈ ట్రైన్‌కు మాత్రం వేర్వేరుగా ఉండటంతో కొందరు గందరగోళానికి గురవుతున్నారు. అయితే, కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండటమే టికెట్ ధరల్లో ఈ మార్పులకు కారణమని తెలుస్తోంది. సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ రైలు చైర్ కారు టికెట్‌ ధరలను పరిశీలిస్తే.. బేస్‌ ఫేర్‌ రూ.1207గా, రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45, మొత్తం జీఎస్టీ రూ.65గా ఉంది. ఇక రైల్లో కేటరింగ్ చార్జ్‌కు గానూ ఒక్కో ప్రయాణికుడిపై రూ.308 చొప్పున పడుతోంది. అదే విశాఖ- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1206గా నిర్ణయించారు . కేటరింగ్‌ ఛార్జీని మాత్రం రూ.364గా పేర్కొన్నారు. ఇక్కడే టికెట్‌ ధరలో రూ. 60 వ్యత్యాసం కనిపిస్తోంది.

సికింద్రాబాద్‌- విశాఖ వెళ్లే రైల్లో ఎగ్జిక్యూటివ్‌ చైర్ కార్‌ ధరను పరిశీలిస్తే.. బేస్‌ ఫేర్‌ రూ.2,485గా, రిజర్వేషన్‌ ఛార్జీ రూ.60, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.75, జీఎస్టీ రూ.131గా పేర్కొన్నారు. కేటరింగ్‌కు గానూ రూ.369 వసూలు చేస్తున్నారు. అదే విశాఖ నుంచి బయల్దేరే రైల్లో కేటరింగ్‌ ఛార్జీని రూ.419గా నిర్ణయించారు. ఇక్కడ కూడా కేటరింగ్‌ ఛార్జీల్లో కొంత వ్యత్యాసం ఉంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ షెడ్యూల్‌ను బట్టి అందించే ఆహార పదార్థాల్లో మార్పులు ఉంటాయి. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట భోజనం అందిస్తారు. ఈ కారణంగానే సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైల్లో కేటరింగ్ ఛార్జీల్లో వ్యత్యాసం.. టికెట్ రేట్లలో కనిపిస్తోంది.