Cheeramenu: పులస మాదిరి గోదాట్లో ఎదురీదే.. చీరమేను గురించి మీకు తెల్సా..?

|

Jul 27, 2024 | 5:33 PM

గోదావరికి ప్రత్యేకం చీరమేను. అంగుళమే ఉన్నా రుచిలో అదరగొడుతుంది. మత్స్యకారులు గోదావరి ఒడ్డున చీరలతో వీటిని పట్టుకుంటారు. పులస మాదిరిగానే రూ.వేలకు వేలు పెట్టినా సీజన్‌లో చీరమీను తినాల్సిందేనంటారు గోదావరి వాసులు.

Cheeramenu: పులస మాదిరి గోదాట్లో ఎదురీదే.. చీరమేను గురించి మీకు తెల్సా..?
Cheeramenu
Follow us on

చీరమేను చేపల గురించి గోదావరి జిల్లాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోదావరి నదిలో సీజనల్‌గా దొరికే అరుదైన జాతి ఇది. చూడటానికి సన్నగా, తెల్లగా ఉంటాయి. ఎక్కువగా చలికాలంలో అంటే.. అక్టోబర్-నవంబర్ నెలల్లో దొరికే చేపలు.. వరదలు నేపథ్యంలో ఇప్పుడు కూడా అడపా దడపా జాలర్లకు చిక్కుతూనే ఉన్నాయి. సన్నగా ఉండే వీటిని వలలతో పట్టడం కుదరదు.  సముద్రం, నది కలిసే ముఖద్వారాల దగ్గర చీర లేదా దోమతెరలు వాడి వీటిని పడుతుంటారు. పులస లాగానే ఈ చీరమేనుకు ఫ్యాన్స్ ఎక్కువ. పులస మాదిరిగానే చీరమేను కూడా గోదావరిలో ఎదురీదుతుంది. ఈ చిన్ని చేపల రుచి అమోఘంగా ఉంటుందని గోదావరి వాసులు చెబుతుంటారు. కేజీలతో పాటు… సోల, తవ్వ, శేరు, కుంచె, బిందెలు, బకెట్ల లెక్కన కూడా వీటిని అమ్ముతూ ఉంటారు.

రాజులు ఈ చీరమేనును ఇష్టంగా తింటారట. పులుసు, ఇగురు పెట్టుకోవడంతో పాటు… చింత చిగురు, మామిడికాయ, గోంగూర కలిపి కూర చేసుకుని తింటారని చెబుతున్నారు. గారెలుగా వేసుకుని ఎక్కువగా తింటుంటారు. కేజీ చీరమేను విలువ 2000 వరకు ఉంటుంది. కేవలం టేస్ట్ మాత్రమే కాదండోయ్.. ఈ చేపల తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయట. బాలింతల్లో పాల ఉత్పత్తి పెంచడంతో పాటు.. ప్రొటీన్లు, కాల్షియం కూడా దండిగా అందుతాయట. అయితే ఏటా గోదావరిలో ఈ చేపల లభ్యత తగ్గుతూ వస్తుందని స్థానిక జాలర్లు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.