
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి 170 కి.మీ, పుదుచ్చేరికి 570 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తుపాన్ గడిచిన 6 గంటల్లో 10 కి.మీ వేగంతో కదిలిందని తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50-70కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అత్యవసర సహయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 నెంబర్లు సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
శుక్రవారం ( 28-11-25) : గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం ( 29-11-25) : అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం ( 30-11-25) : ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.