ఏపీలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను గుక్కతిప్పుకోనివ్వడంలేదు. ఓ వైపు భారీ వర్షాలు… అంతలోనే మోకా తుఫాను హెచ్చరికలు…ఇప్పుడు భానుడి భగభగలు…ఏపీలో వాతావరణ పరిస్థితి రోజుకో తీరుగా తయారయ్యింది. మొన్నటి వరకు ఏపీని భారీ వర్షాలు హడలెత్తించాయి. కాయకష్టం చేసుకునే రైతు నెత్తిన పిడుగులా మారాయి. నిన్న మొకా తుఫాను హెచ్చరికలు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేశాయి. తాజాగా ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. సోమవారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. కసింకోటలో 41 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత నమోదయ్యింది.
అంతేకాదు, రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో మళ్ళీ భానుడి భగభగలు ఏపీలో ప్రతాపం చూపనున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. 11 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉన్నదని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ప్రకటించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాలు, అనకాపల్లిలో 4, కాకినాడ జిల్లాలో 4 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. అయితే మొకా తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా లేకపోగా ఎండలు మాత్రం దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు తీవ్ర వర్షాలు కురిసి ఏపీ రైతన్నలు నానా అవస్థలు పడ్డారు ఇప్పుడు తీవ్రమైన ఎండలు హడలెత్తిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..