
కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏటా విజయదసమి నాడు బన్ని ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక జైత్రయాత్ర జరుగుతోంది. ఈజాతరలో ఎంతమందికి గాయాలైన, ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా కర్రలతో కొట్టుకుంటారు. ఈ సారైనా హింసను అరికట్టాలని పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఈసారి బన్నీ ఉత్సవం పోలీసుల నిఘా నీడలో జరగనుంది. ఉత్సవం జరిగే ప్రాంతంలో 100కు పైగా నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 పైగా ఎల్ఈడీ లైట్లు.. 10 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. కర్రల సమరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్ధం చేశారు.
ఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 50 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు సహా 800 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ఐదు చెక్‌పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా చేసేవారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
సమరానికి ముందు.. దేవరగట్టు కొండపై మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో మాళమ్మ, మల్లేశ్వరస్వామికి అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరగనుంది. ఆ తర్వాత.. కొండ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడతారు.