Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు.. గురువారం ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)కి 400 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి 420 కి.మీ., పూరి (ఒడిశా)కి 450 కి.మీ. పారాదీప్(ఒడిశా)కి 500 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు.. గురువారం ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..
Rain Alert

Updated on: Oct 01, 2025 | 9:17 PM

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి 360 కి.మీ.,గోపాల్‌పూర్ (ఒడిశా)కి 360 కి.మీ., పూరి (ఒడిశా)కి 390 కి.మీ., పారాదీప్ (ఒడిశా)కి 450కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు రాత్రికి తీవ్ర వాయుగుండంగా మరింత బలపడనున్నట్లు పేర్కొంది. గురువారం అర్ధరాత్రి నుండి ఎల్లుండి తెల్లవారుజాము లోపు ఒడిశా, ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాలను గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని.. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

గురువారం (02-10-25): ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి(జి) మాడుగుల 73.5మిమీ, గాదిరాయిలో 51.7మిమీ, అల్లూరి(జి) అరకులో 38.2మిమీ, శ్రీకాకుళం (జి) పలాసలో 36.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం.. రెండో ప్రమాద హెచ్చరిక..

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి గోదావరి నది భద్రాచలం వద్ద 44.90 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 12,72,682 క్యూసెక్కులు ఉండి మొదటి హెచ్చరిక కొనసాగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,08,233 క్యూసెక్కులు ఉందని, రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. కృష్ణా,గోదావరి నదుల వరద ప్రవాహం రేపటి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టనున్నట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..