ఏపీలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. స్పెషల్ రివిజన్ పేరుతో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అందుకనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి నిన్నటిదాకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పరుగులు తీశారు. అన్ని ప్రాంతాల్లో భూముల ధరలతో పాటు నిర్మాణాల రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని అర్బన్, రూరల్ ఏరియాల్లో మాత్రమే భూముల ధరలు, నిర్మాణాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి. చాలా చోట్ల 29 నుంచి 31 శాతం మేర ధరలు పెంచారు. ఆయా జిల్లాల జేసీలు స్థానిక డిమాండ్ ని బట్టి రేట్ల ధరను నిర్ణయించారు. భూముల ధరలతో పాటు భవనాలు,ఇతర నిర్మాణాల రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచారు.
విశాఖ విషయానికి వస్తే అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రాంతాల్లో భూముల విలువ పెరిగింది. అత్యధికంగా స్థిరాస్తి లావాదేవీలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రమే భూముల మార్కెట్ విలువను పెంచినట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 20 శాతం నుంచి 100 శాతం వరకు స్థిరాస్తి విలువను పెంచుతూ చేసిన సవరణలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భూముల విలువతో పాటు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను కూడా పెంచారు. అపార్ట్‌మెంట్లలో SFT రేటును 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లను బహుళ అంతస్తుల నిర్మాణాలు సాగుతున్న ఎండాడ, మధురవాడ, కొమ్మాది, పెందుర్తి, అగనంపూడి వంటి ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.
ఇక రాయలసీమ జిల్లాల్లో 25 నుంచి 35 శాతం వరకు భూముల మార్కెట్ విలువ పెరిగింది. అర్బన్ ఏరియాలతో పాటు వాటికి దగ్గరగా ఉండి అభివృద్ధి జరుగుతున్న రూరల్ ఏరియాల్లో భూముల విలువను పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆదాయం వచ్చే 20 శాతం గ్రామాల పరిధిలోనే భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం