బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుపానుగా మారి విజృంభించబోతోంది. ఈ తుపానుకు ‘మిచౌంగ్’ గా నామకరణం చేశారు. ఈ మిచౌంగ్ తుపాను ఈ నెల 5న మచిలీపట్నం, నెల్లూరు మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని వాయుగుండం.. నెల్లూరు, మచిలీపట్నానికి వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 5న నెల్లూరు- మచిలీపట్నం మధ్య 90 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం దాటనుంది. దాంతో.. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా.. ఏపీకి మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే.. కోస్తాంధ్ర వైపు తుపాను దూసుకొస్తోంది. దాంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు.. మిచౌంగ్ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడును కూడా తుపాను ముప్పు వెంటాడుతోంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నైలోని పలు ప్రాంతాలు వరదలో చిక్కుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తీర ప్రాంతాల్లోని 12 జిల్లాల కలెక్టర్లతో సీఎం స్టాలిన్ రివ్యూ చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..