Cyclone Mandous: తీవ్ర తుపాన్ నుంచి తుపానుగా బలహీనపడిన మాండూస్.. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం..

|

Dec 09, 2022 | 4:25 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనడిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను ప్రస్తుతానికి శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి..

Cyclone Mandous: తీవ్ర తుపాన్ నుంచి తుపానుగా బలహీనపడిన మాండూస్.. మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం..
Cyclone Mandous
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనడిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాను ప్రస్తుతానికి శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో, మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 10కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండురోజులు దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మాండూస్ తుపానుపై భారత వాతావరణ శాఖ తాజా  బులెటిన్ విడుదల చేసింది. తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు.. శనివారం తమిళనాడు, రాయలసీయ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని,  అలలు ఎగసిపడతాయని తెలిపింది. ఈదురు గాలులకు పంటలు, తోటలు, కచ్చా గృహాలు ధ్వంసమయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తుఫాన్‌ ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్‌. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఒంగోలు చేరుకున్నాయి NDRF, APSDRF బృందాలు. ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్ దినేష్ కుమార్.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి సైతం రాష్ట్రంలో తుపాను పరిస్థితులపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీకిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఇప్పటికే సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..