Cyclone Arnab: దూసుకువస్తున్న తుఫాను.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందో తెలుసా..?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వ్యవస్థకు ‘అర్నబ్’ అనే పేరు పెట్టే అవకాశం ఉండగా, అక్టోబర్ 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య ఏపీ తీరాన్ని దాటవచ్చని అంచనా. తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది సోమవారం తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ప్రస్తుతం 15 కిలో మీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖకు 730 కిలోమీటర్లు, కాకినాడకు 820, మచిలీపట్నంకు 920, బాపట్లకు 990 కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ క్రమంగా తీవ్రవాయుగుండం బలపడుతోందని.. మరికొద్ది గంటల్లో తుపాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్‌గా మారాక ‘అర్నబ్’ గా నామకరణం చేయనున్నారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర తుఫానుగా తీవ్ర తుఫానుగా బలపడనుంది. వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల 28 నాటికి అతి తీవ్ర తుఫానుగా మరి.. 28 ఉదయం బాపట్ల విశాఖ మధ్య తీరం దాటి అవకాశం ఉందని.. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో భారీనుంచి అతి భారీ వర్ష సూచన చేసింది. నేటి నుంచి 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఏపీలోని 12 జిల్లాలకు హైఅలర్ట్ జారీ చేశారు.
ఏపీలో 3 రోజులపాటు భారీ వర్షాలు..
ఏపీలో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉమ్మడి గోదావరి, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు , కృష్ణా జిల్లాలతో పాటు… లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలకు సైతం అలర్ట్ జారీ చేసింది. ఈనెల 29వరకు ఏపీ, ఒడిశా తీరాల్లో మత్య్సకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఈనెల 27 నుంచి 29 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అర్నాబ్ అలెర్ట్‌లో భాగంగా… పాపికొండల విహారయాత్రకు బ్రేక్ వేశారు అధికారులు.
అర్నాబ్ తుఫాను ప్రభావంపై ఇప్పటికే అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు… ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. తుఫాన్ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ వాతావరణ సూచన:
తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు మరియు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
