నేటి ఆధునిక సమాజంలో నైతిక విలువలకు తావు లేకుండా పోయింది. మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడంతో మన నుంచి నాది అన్న స్వార్ధం పెరిగిపోయింది. ఒకప్పుడు గ్రామాలలో ఉమ్మడి కుటుంబాలతో పిల్లా పాపలతో ఇల్లు కళక లాడుతుండేవి. కుటుంబంలో ఎవరికీ ఏ ఆపద వచ్చినా అందరూ అండగా ఉండేవారు. కుటుంబం పెద్ద దిక్కు తల్లితండ్రుల అడుగుజాడల్లో నడిచేవారు. తండ్రి చెప్పిందే పిల్లలకు వేదంలా ఉండేది. కాలనుగుణంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అయ్యాయి ఎవరికీ వారు విడి విడిగా జీవించడానికే ఇష్టపడుతున్నారు.
అంతేకాదు కనీసం నవమాసాలు మోసి కని పెంచిన తల్లితండ్రులను కంటికి రెప్పలా సంరక్షించాలన్న విచక్షణ కూడా లేకుండా రోడ్డున వదిలేస్తున్నారు కొందరుఇటీవలి కాలంలో పెద్దలను చూడకుండా రోడ్డున వదిలేసే సంఘటనలు ఎక్కువయ్యాయి. ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా న్యాయ శాస్త్రంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సంరక్షించకపోయినా వారు ఇచ్చిన ఆస్తులు వెనక్కు తీసుకునేలా చట్టం చేసింది. అంతేకాకుండా వారి సంపాదన ఆస్తులలో వాటా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యలమంచిలి మండలం వై. వి. లంక గ్రామానికి చెందిన పాలపర్తి మరియమ్మకు తన భర్త సంపాదించినా ఆస్తులను తన ముగ్గురు కుమారులకు పంచింది. ముగ్గురు కుమారులలో ఒకరు చనిపోగా మిగతా ఇద్దరు కుమారులు గల్ఫ్ దేశంలో బాగా సంపాదిస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిని సంరక్షించాల్సిన కొడుకులు, కోడళ్లు ఆమెను వదిలేశారు. దీంతో మరియమ్మ ఒంటరిగా జీవనం సాగించలేక నరసాపురం సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన నరసాపురం ఆర్డీఓ డివిజనల్ మిజిస్ట్రేట్ అచ్యుత్ అంబరీష్ బాధితురాలు మరియమ్మ పోషణ నిమిత్తం ఇద్దరు కుమారులను చెరో నాలుగు వేలు , కోడలు రెండు వేలు కలసి మొత్తం పది వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చారు.
వృద్దుల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా రోజు రోజుకూ వీధిన పడుతున్న వృద్దులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తల్లితండ్రులను వృద్ధాప్యంలో వారి పిల్లలు అనాధులుగా వదిలేస్తే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ అజమాయిషీలో పని చేస్తుంది . వీరి సమస్యను ట్రిబ్యునల్ 60 రోజుల్లోగా పరిష్కరించాలి. వృద్దులు కోసం తల్లితండ్రుల సంక్షేమం – సీనియర్ సిటిజన్ చట్టం 2007, వృద్దులు సంరక్షణ చట్టం 2019 లు అమలులో ఉన్నాయి. వృద్దులును దూషించినా, నిర్లక్ష్యం చేసినా 6 నెలలు జైలు శిక్ష, 10 వేలు జరిమానా వరకు ఉంటుంది.
వృద్దులు తమ పోషణ కోసం పిల్లలను అడిగే హక్కు ఉంది. అల్లుడు, కోడలిని పిల్లల కిందికి తీసుకువస్తూ బిల్లు సవరణ తీసుకు వచ్చారు. అంతే కాదు ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌కు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు సహాయంతో సేకరించి వారిని ప్రతి నెలా సందర్శించి వారికి కావాల్సిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. అంతే కాదు 2007లో ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం సెక్షన్( 23) ప్రకారం వృద్దులు తమ ఆస్తులను తమ సంతానానికి రాశాక వారిని చూడక పోతే తిరిగి ఆస్తిని వెనక్కు తీసుకునే హక్కు కల్పించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..